logo

సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?

ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా?

Updated : 10 May 2024 05:59 IST

ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. ఆ సమయంలో నీవు ఓటు వేస్తే సిరా గుర్తు చూపించూ అని ఎదుటివారిని అడగడం చూస్తుంటాం. పోలింగ్‌లో పాల్గొనే వారికి చెదిరిపోని సిరా గుర్తును పెట్టాలనే నిబంధన ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎడమ చేయి చూపుడు వేలిపై వేసే సిరా చుక్కే నిజమైన ఆధారంగా ప్రతి ఒక్కరూ చూపిస్తూ.. ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాల్లో గుర్తుగా పెడుతున్నారు. సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే అదే చేయిలోని మధ్యవేలుపై సిరా చుక్క అంటించాల్సి ఉంటుంది. ఒక వేళ మధ్యవేలు కూడ లేకుంటే బొటన వేలుపై గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సూచించింది. మరికొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఎడమచేయి తొలగించి ఉంటే కుడిచేయి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించాలని, ఆ వేలు కూడా లేకుంటే మధ్యవేలుకు, మధ్యవేలు కూడా లేకుంటే ఉంగరం వేలుకు, రెండు చేతులకు వేళ్లు లేకపోతే చేయి మధ్యభాగంలో, పైభాగంలో, భుజం వద్ద సిరా గుర్తు పెట్టాలని ఈసీ నిబంధనల్లో వివరించింది.

న్యూస్‌టుడే, వెంకటాపూర్‌


పోలింగ్‌ సిబ్బంది మెనూ అదిరింది!

వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి మెనూ మార్చారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాలకు ఈనెల 12న సిబ్బంది చేరుకోగానే సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, తరువాత 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య భోజనంలో అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ అందిస్తారు. పోలింగ్‌ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య క్యారట్‌, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ, 11 గంటలకు మజ్జిగ, 12 గంటలకు మజ్జిగ అందిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యన కోడిగుడ్డు కూరతో అన్నం, కూరగాయల కూర, చట్నీ, సాంబారు, పెరుగు అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం, 4 గంటలకు నిమ్మరసం లేదా మజ్జిగ అందిస్తారు. 5.30 గంటలకు టీ, గుడ్‌డే బిస్కెట్‌లు అందిస్తారు. ఈ మెనూ అందించే బాధ్యతను గ్రామాల్లో పంచాయతీ అధికారులకు అప్పగించారు. కార్పొరేషన్‌, పురపాలక సంఘాలలో అధికారులు నియమించిన ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలలో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.  

న్యూస్‌టుడే, గోపాలపూర్‌


వాట్సప్‌ కాల్స్‌తోనే శ్రీరామరక్ష !

అసలే ఎన్నికల సమయం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీల నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై మనసులో ఎంత కోపమున్నా ముఖంపై నవ్వును పులుముకొని కలుపుగోలుగా ముచ్చటిస్తూ ముందుకు వెళితేనే మేలు కలుగుతుంది. ఈ సారి ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నాయి. చేతిలో చరవాణి ఉంటే చాలు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు ఏ మాత్రం నోరు జారినా రికార్డు చేసి ట్రోల్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ భయంతో వివిధ పార్టీల అభ్యర్థులు, నేతలు ఫోన్లలో ఆచి తూచి మాట్లాడుతున్నారు. సున్నితమైన అంశాలపై చరవాణిలో మాట్లాడాలంటే బెదిరి పోతున్నారు. మాట్లాడే క్రమంలో నోరు జారినా, రహస్య విషయాలను సంభాషిస్తే వాటిని రికార్డు చేసి రట్టు చేసి  తమ ప్రతిష్ఠను చెడగొడతారనే భయం నేతలను నీడలా వెంటాడుతోంది. ఈ ప్రమాదంలో చిక్కుకోకుండా ఇటీవల పలువురు అభ్యర్థులు, ముఖ్య నేతలు వాట్సప్‌ కాల్స్‌లో మాట్లాడుతున్నారు. వాట్సప్‌ కాల్స్‌లో మాట్లాడే మాటలను రికార్డు చేయలేరనే ధీమాతో ఈ కాల్స్‌నే ఉపయోగిస్తున్నారు.

న్యూస్‌టుడే, నర్సంపేట


22 రోజుల ఉత్కంఠ తప్పదు!

లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగులు, ఇంటింటా ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.. దీంతో ఓటర్ల పని పూర్తవుతుంది. నాయకులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి ఉత్కంఠ మొదలవుతుంది. 22 రోజుల వరకు ఇది తప్పదు.. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనుంది. అప్పటివరకు వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పోటీపడిన అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు ప్రతి రోజూ పోలింగ్‌ సరళిపై క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తూ, గెలుపోటములపై అంచనాలు వేసుకోక తప్పదు.

న్యూస్‌టుడే, భూపాలపల్లి


చరవాణీ ద్వారా ఓటరు చీటి పొందండిలా..!

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోల్‌ స్లిప్పుల పంపిణీ చేపట్టింది. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి స్లిప్పులు అందిస్తున్నారు. ఆ సమయంలో కొందరు అందుబాటులో లేకపోవడం, చీటీలను పోగొట్టుకోవడం వంటి కారణాలతో కొందరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈసీ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు ఉందో తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం కేటాయించిన 1950 టోల్‌ఫ్రీ నంబరుకు సంక్షిప్త సమాచారం పంపిస్తే చాలు జాబితాలో ఉన్న వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇందుకు టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ ద్వారా ఈసీఐ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటరు ఐడీ నెంబరును టైప్‌ చేసి ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు.. 15 నిమిషాల్లో మీ చరవాణీలో పేరు, పార్టు నంబరు, సీరియల్‌ నంబరు, పోలింగ్‌ కేంద్రం వివరాలన్నీ వస్తాయి. ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ కల్పించిన సదుపాయాన్ని ఓటర్లు ఇలా సద్వినియోగం చేసుకోవచ్చు.

న్యూస్‌టుడే, వెంకటాపురం


ఓటేస్తూ స్వీయ చిత్రాలు తీసుకోవద్దు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువైనదే కాదు రహస్యమైనది కూడా. ఓటును బహిర్గతపరిచేందుకు నిబంధనలు అంగీకరించవు. పోలింగ్‌ కేంద్రంలో ఓటరు ఓటుహక్కును వినియోగించుకునే క్రమంలో చరవాణితో స్వీయ చిత్రాలు దిగడం, ఇతరులకు చూపడం నిషేధం. ఎవరైనా అలా చేస్తే 49ఎం నిబంధన ప్రకారం (ఓటు రహస్యం) ఓటును బహిర్గతపర్చిన ఓటరును అధికారులు బయటకు పంపిస్తారు. ఎన్నికల నిబంధన 17ఎ లో ఆ ఓటును నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే ఆ ఓటు నిరుపయోగమవుతుంది. అందుకే ఓటర్లూ తస్మాత్‌ జాగ్రత్త. నిబంధన 49ఎన్‌ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 18 ఏళ్లు దాటిన సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. అయితే సదరు సహాయకుడు అంధుడి ఓటును బహిర్గతపర్చనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.  

న్యూస్‌టుడే, నర్సంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు