logo

అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్‌

దోపిడీలో కాంగ్రెస్‌ నెంబర్‌వన్‌గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ధ్వజమెత్తారు.

Published : 10 May 2024 02:28 IST

అంతటా కమలం వికసిస్తుంది
జనసభలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ

తొర్రూరు జనసభలో ప్రసంగిస్తున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ. పక్కన వరంగల్‌ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌

తొర్రూరు, న్యూస్‌టుడే: దోపిడీలో కాంగ్రెస్‌ నెంబర్‌వన్‌గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు భారతరత్న పదవి ఇచ్చి గౌరవించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో  భాజపా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పాలకుర్తి జనసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వరంగల్‌ చారిత్రక ప్రాంతమని.. స్మార్ట్‌ సిటీలో వరంగల్‌ అభివృద్ధికి కేంద్రం అధిక నిధులు అందజేస్తోందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా కమలం వికసిస్తుందని అన్నారు. ప్రజాసేవలో ఉన్న అరూరి రమేశ్‌ మచ్చలేని నాయకుడన్నారు. అవినీతికి నిలయమైన కాంగ్రెస్‌ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్‌ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ను గెలిపించి ప్రధాని నరేంద్రమోదీకి కానుకగా అందించి తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన్ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.  

రెండున్నర గంటలు ఆలస్యంగా రాక..

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సభకు హాజరుకావాల్సి ఉండగా ఆకస్మికంగా ఆయన పర్యటన రద్దు కావడంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా రెండున్నర గంటలు ఆలస్యమైంది. మొదటగా అరూరి, ఇతర నాయకులు ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 1:32 గంటలకు భజన్‌లాల్‌ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు.  పార్టీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ధర్మారావు తెలుగులోకి తర్జుమా చేశారు. 1:44 గంటలకు ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరారు.

భాజపా శ్రేణుల్లో ఉత్సాహం

తొర్రూరు జనసభ విజయవంతం కావడంతో భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ కోరినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సభలో పార్టీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వైవీ రావు, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు పాల్గొని సభను విజయవంతం చేశారు.

అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

వరంగల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌

కాంగ్రెస్‌ పాలనపై ఐదు నెలలకే ప్రజలకు విరక్తి వచ్చింది. అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని అమలు కాని హామీలను చెప్పి గద్దెనెక్కి విస్మరించారు. ప్రతి మహిళకు రూ.2500, వృద్ధులకు రూ.4 వేల పింఛను, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు, తదితర హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే తొర్రూరు పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌, రోడ్ల మరమ్మతుకు చర్యలు, కొడకండ్లలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తా. వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నా.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని