logo

అమ్మినోళ్లకు సొమ్ములు..కొన్నోళ్లకు పాట్లు

భీమవరంలో ఓ స్థిరాస్తి వ్యాపారి ఒకే దరఖాస్తుతో పలు ప్రాంతాల్లో స్థలాలు పూడ్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి వారు ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా వారి పక్షంలో చేరిపోతుంటారు. వారితో దిగిన ఫొటోలతో భారీ ఫ్లెక్సీలను అనధికారిక

Published : 26 May 2022 03:50 IST

పట్టణాల చుట్టూ అడ్డగోలుగా అనధికారిక లేఅవుట్లు

భీమవరం వద్ద అనధికారిక లేఅవుట్‌లో రహదారిని ధ్వంసం చేస్తున్న సిబ్బంది

భీమవరంలో ఓ స్థిరాస్తి వ్యాపారి ఒకే దరఖాస్తుతో పలు ప్రాంతాల్లో స్థలాలు పూడ్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి వారు ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా వారి పక్షంలో చేరిపోతుంటారు. వారితో దిగిన ఫొటోలతో భారీ ఫ్లెక్సీలను అనధికారిక లేఅవుట్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి హంగులు, ప్రచార ఆర్భాటాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు.

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 18 ఎకరాల్లో లేఅవుట్‌ చేశారు. సమీపగ్రామాల్లో అక్రమంగా తవ్విన మట్టిని తెచ్చి దీనిని పూడ్చినట్లు సమాచారం. పడాలలోనూ ఈ తరహాలో 20 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి జాగాలను విక్రయిస్తున్నారు. తణుకు ప్రాంతంలో ఈ తరహా అనధికార లేఅవుట్లు పెద్ద సంఖ్యలు ఉన్నట్లు సమాచారం.

భీమవరంలోని ఓ ప్రాంతంలో పంట బోదెల భూమిని పూడ్చేసి స్థలాల విక్రయాలకు సిద్ధం చేయగా పట్టణప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు పరిశీలించి దానిలో రహదారులను తొలగింపజేశారు. ఫిర్యాదులు అందినప్పుడు, ఉన్నతాధికారులు గుర్తించినప్పుడు స్థానిక అధికారులు ఆయా స్థలాల్లోకి వెళ్లి సరిహద్దు రాళ్లను, రహదారులను తొలగించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే : పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. జనాభా సంఖ్య పెరుగుతూనే ఉండటంతో ఇంటి స్థలాలకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇదే అదునుగా పట్ణణ శివార్లలో, సమీప గ్రామాల్లో కొందరు వ్యాపారులు అడ్డగోలుగా అనధికారిక లేఅవుట్‌లు వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో భూ వినియోగమార్పిడి రుసుములు చెల్లించకుండానే స్థలాలను పూడ్చేస్తున్నారు. ఇలాంటి లేఅవుట్లలో జాగాలు కొనుగోలు చేసిన కొందరి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారుతోంది. అనుమతులన్నీ ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేయడంతో వారి మాట నమ్మి స్థలం కొనుగోలు చేసిన వారు తరువాత ఇంటి నిర్మాణాలు, రుణాల కోసం నానా అవస్థలు పడుతున్నారు.

నిబంధనలు ఇవీ.. వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు వినియోగించాలంటే నిర్ణీత రుసుములు చెల్లించి అనుమతులు పొందాలి. ప్లాట్లుగా విభజించిన భూమిలో 10శాతం ఆయా పంచాయతీ లేదా పురపాలక సంఘాలకు రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ప్లాట్లలో 40 అడుగుల వెడల్పుతో రహదారులు ఉండాలి. భూమి విలువ ప్రకారం డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాల కల్పనకు కొంతమేర సెక్యూరిటీగా డిపాజిట్‌ చేయాలి.

కొనసా..గుతూనే.. అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2019లో ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో 1148 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా ప్రతి పట్టణ పరిధిలోనూ అనధికారిక లేఅవుట్లు పుట్టుకొచ్చాయంటే పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు అనధికార లేఅవుట్లలో స్థలాల విక్రయాలు జరగకుండా పట్టణ ప్రణాళిక అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులతో పూర్తి పర్యవేక్షణ చేపట్టామని పట్టణ ప్రణాళిక ఆర్డీ వై.పాండురంగనాయకులు చెప్పారు. గతంలో గుర్తించిన స్థలాల్లో సరిహద్దు రాళ్లను తొలగింపజేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో పరిశీలన జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని