logo

కర్షకులను కష్టపెడుతున్నారు!

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయపెట్టినట్లే ఈ ప్రభుత్వం రైతులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆచంట కచేరి సెంటర్‌లో ధాన్యం బకాయిలు చెల్లించా

Updated : 28 Jun 2022 06:59 IST

మహాధర్నాలో మాజీ మంత్రి పితాని

మాట్లాడుతున్న సత్యనారాయణ

ఆచంట, న్యూస్‌టుడే: ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయపెట్టినట్లే ఈ ప్రభుత్వం రైతులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆచంట కచేరి సెంటర్‌లో ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. భారీ సంఖ్యలో రైతులు, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తున్నా సొమ్ములు చెల్లించకపోతే రైతులు ఏ విధంగా ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.265 కోట్లే జమ చేశారన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తన నియోజకవర్గానికే మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు రాయితీపై అందించే ట్రాక్టర్లు, యంత్ర పరికరాల పంపిణీలో సైతం కోత పెట్టారని వివరించారు. తెదేపా నియోజకవర్గ పరిశీలకులుగా హాజరైన మెట్ల రమణబాబు మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఆచంట జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, నాయకులు తమ్మినీడి ప్రసాద్‌, కేతా మీరయ్య, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పి.రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని