logo

దేవుడి భూమైనా.. శ్మశానమైనా.. కబ్జానే

ఇది తణుకు జాతీయ రహదారి సమీపంలోని కేశవస్వామి ఆలయ భూమి. సర్వే నంబర్‌ 134లో ఉన్న 15.68 ఎకరాల భూమిలో గతేడాది కూడా పంట వేశారు.

Published : 29 Jan 2023 05:19 IST

నాయకుల  కనుసన్నల్లో తంతు

పట్టించుకోని యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌,  ఏలూరు

ఇది తణుకు జాతీయ రహదారి సమీపంలోని కేశవస్వామి ఆలయ భూమి. సర్వే నంబర్‌ 134లో ఉన్న 15.68 ఎకరాల భూమిలో గతేడాది కూడా పంట వేశారు. నాలుగు నెలల తర్వాత పొలాలు మెరక చేసి ఎగ్జిబిషన్‌ పెట్టేశారు. దేవాదాయశాఖ భూములను సాగు చేసుకోవాలి. రూపు మార్చి వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనల అతిక్రమణే కాదు నేరం. నామమాత్రపు కౌలు చెల్లించే భూమికి ఎగ్జిబిషన్‌ పెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. కౌలుకు ఇచ్చే నగదు ఆలయానికి జమ చేసి ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయం జేబుల్లో వేసుకున్నారని తెలుస్తోంది. ఇదంతా వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకుడు చేశారని సమాచారం. రెవెన్యూ, పురపాలక, ఆలయ ఆధికారులంతా జీహుజూర్‌ అన్నారు. ఇదే ఆలయ పంట భూమిలో రెండేళ్ల క్రితం సీఎం వస్తున్నారని హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ దాన్ని తొలగించలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి ఆ భూమికి చెల్లించాల్సిన కౌలు చెల్లించేశారు అని అధికారులు, నాయకులు దురుసుగా సమాధానమిస్తున్నారు.  


* ఇది ముసునూరు మండలం రమణక్కపేటలో శ్మశాన స్థలం. సమాధులుండాల్సిన చోట దుకాణాలున్నాయి అనుకుంటున్నారా. 259/1లో 6.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొందరు వైకాపా నాయకులు గత మూడేళ్ల నుంచి కబ్జా చేస్తున్నారు. ఇప్పటికి 3 ఎకరాల వరకూ ఆక్రమించి అందులో కోళ్లఫారాలు, మాంసం దుకాణాలు పెట్టారు. వైకాపా నాయకులే ఈ స్థలాన్ని ఆక్రమించారన్నది బహిరంగ రహస్యమే. అయినా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు.  ఆక్రమించిన భూమి విలువ రూ.1.5 కోట్లు.


ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. అది దేవాదాయ భూమా..పంచాయతీ జాగానా..శ్మశానం స్థలమా అని చూడరు. నాయకుల అండతో గ్రామాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ ఆక్రమణ చెరలోకి వెళ్లిపోతున్నాయి.  వీటిని అడ్డుకోవటంలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ స్థలమా..అయితే అడిగేవారెవరూ అని ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారు.  

ఖాళీగా ఉంటే చాలు.. ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందంటే చాలు కొందరు వైకాపా నాయకులు పాగా వేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మెరక చేసి...చిన్న పాక వేస్తారు. వెంటనే భూమి ఏ శాఖ పరిధిలో ఉందో ఆ అధికారులకు పెద్ద నేతలతో సిఫార్సు చేయించి ముడుపులు సమర్పిస్తారు. దీంతో అధికారులు ఆ వైపు  చూడటం లేదు. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పెద్దస్థాయి ఆక్రమణలు నేరుగా నియోజకవర్గ స్థాయి నాయకులే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై  పశ్చిమ గోదావరి కలెక్టర్‌ ప్రశాంతి, ఏలూరు  జేసీ ఆరుణ్‌బాబును వివరణ కోరగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ముసునూరు మండలం రమణక్కపేట  పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో భూమి ఆక్రమించి నిర్మాణం కూడా మొదలుపెట్టారు. 162/15 సర్వేనంబర్‌లో పంచాయతీ కార్యాలయానికి దాతలు ఇచ్చిన స్థలంలో రెండు సెంట్ల భూమి ఖాళీగా ఉంది. దాన్ని ఓ వైకాపా నేత ఆక్రమించి దుకాణ నిర్మాణం చేపట్టారు. అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని