logo

Eluru: ప్రియురాలి హత్య.. ఆపై ఆత్మహత్య

వివాహేతర సంబంధాలు, అడ్డూఅదుపూ లేని జీవితాలు చివరకు ఇలా అర్ధంతరంగా ముగుస్తాయి అనే దానికి ఏలూరు నగరంలో జరిగిన ఘటనే నిదర్శనం.

Updated : 29 Aug 2023 09:09 IST

తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో దారుణం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధాలు, అడ్డూఅదుపూ లేని జీవితాలు చివరకు ఇలా అర్ధంతరంగా ముగుస్తాయి అనే దానికి ఏలూరు నగరంలో జరిగిన ఘటనే నిదర్శనం. కొంతకాలం తనతో సఖ్యతగా ఉండి ఆ తరువాత నిర్లక్ష్యం చేస్తోందనే కారణంగా ఆమెను హతమార్చాడు. తరువాత పోలీసులు పట్టుకుంటారనో.. ఇక జీవితం ముగించాలనో అతను కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు దక్షిణపు వీధి అశోక్‌ చక్రం ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. కత్తితో పీక కోసి చంపేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నగర శివారు శనివారపుపేటకు చెందిన ఉడతా సుజాత(30)గా గుర్తించారు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది.. ఎవరు చంపారు.. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె మృతి చెందిన ఇంట్లో దిమ్మిటి సత్యనారాయణ(40) నివాసముంటున్నాడు. అతనికి వివాహమైనా భార్యతో విభేదాలు రావడంతో అయిదేళ్ల కిందట వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా అతనితో సన్నిహితంగా ఉంటోందని, అప్పుడప్పుడూ వచ్చివెళ్తుందని స్థానికులు కొందరు చెప్పడంతో పోలీసులకు విషయం అర్థమైంది.

నూజివీడు సమీపంలో రైలు కింద పడి..

తనతో సన్నిహితంగా ఉండే సుజాతను సత్యనారాయణ కత్తితో పీక కోసి చంపాడు. ఆదివారం రాత్రి తన ఇంటికొచ్చిన ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న సుజాతను అక్కడే వదిలేసి సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. పోలీసులకు దొరికిపోతానేమోనని భయపడ్డాడు. అలా నూజివీడు సమీపంలోకి చేరుకున్నాక రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనం పెట్టి పట్టాలు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతని  జేబులో ఓ చీటీపై పేరు, చిరునామా ఉండటంతో వివరాలు తెలుసుకున్నారు. అలాగే  ద్విచక్ర వాహనాన్ని, అతని జేబులో ఉన్న చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

విషయాన్ని సూసైడ్‌ నోట్‌లో రాసి..

సుజాత తనను కొద్ది రోజులుగా దూరం పెడుతోందని.. గతంలో బాగానే ఉండేదని.. ఆమెకు తాళి కూడా కట్టానని సత్యనారాయణ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. కొద్ది రోజులుగా అవమానిస్తోందని, అందుకే ఆదివారం రాత్రి నమ్మకంగా ఇంటికి పిలిపించుకుని ఈ విధంగా చేశానని పేర్కొన్నాడు. దాన్ని పోలీసులు ఇంట్లో గుర్తించారు. తొలుత సత్యనారాయణ మృతి విషయాన్ని అతని బంధువులకు రైల్వే పోలీసులు చెప్పడంతో అతని నివాసానికి వెళ్లిచూశారు. లోపల సుజాత మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులకొట్టిన పోలీసులు లోపల రక్తపు మడుగులో ఉన్న సుజాత మృతదేహాన్ని, పక్కనే ఉన్న కత్తిని పరిశీలించారు. ఆ పక్కనే కిటికీలో ఉన్న సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే సుజాతను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నారు.

సుజాత నేపథ్యం ఇదీ..

సుజాతకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. శనివారపుపేటలో నివాసం ఉంటున్నారు. భర్త లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతను, సత్యనారాయణ స్నేహితులు. ఈ కారణంగానే సుజాతకు, సత్యనారాయణకు పరిచయం ఏర్పడింది. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు  సుజాత సత్యనారాయణ ఇంటికి వెళ్లి వస్తుంటుంది. లారీ డ్రైవర్‌ ఈ నెల 23న భోపాల్‌ వెళ్లారు. అతనికి పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సుజాతకు సత్యనారాయణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. అతను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానిపై లోతుగా విచారణ చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ రాజశేఖర్‌ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని