logo

పొలం చూపించారు.. కొండ కేటాయించారు!

ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు.

Published : 28 Mar 2024 04:24 IST

ఏడాదికి రూ.1.30 లక్షల నష్టం.. నిర్వాసితుడి ఆవేదన  

కొండ ఇచ్చారని చూపిస్తున్న శివకృష్ణ

పోలవరం, న్యూస్‌టుడే: ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. నిర్వాసిత రైతులను వెంటబెట్టుకు వెళ్లి భూములు చూపించి వారి అంగీకారంతోనే వాటిని సేకరించి గిరిజనులకు సాగు పట్టాలు అందజేశారు. పునరావాస కాలనీ పూర్తికాకపోవడం, పాత గ్రామం నుంచి కాలనీకి దూరం కావడంతో అక్కడకు నిత్యం వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేక అధికారులు ఎవరి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారో వారికే కౌలుకు ఇచ్చారు పోలవరం మండలంలో మొదటి దశలో ఖాళీ చేసిన ఏడు గ్రామాల్లో ఒకటైన చేగొండపల్లి గిరిజనులు. అందులో కొందరికి కొండ ఇచ్చిన విషయం పునరావాస కాలనీకి తరలివెళ్లిన తరువాత నిర్వాసితులకు తెలిసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరిగిన తండ్రి మరణంతో కోర్టును ఆశ్రయించాడు నిర్వాసితుడు ముచ్చిక శివకృష్ణ.

2010లో భూసేకరణ

2010లో ఆనాటి జిల్లా కలెక్టర్‌ చేగొండపల్లి నిర్వాసితుల కోసం ప్రగడపల్లి పంచాయతీ పరిధిలోని 39 రైతులకు సంబంధించి 173.41 ఎకరాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వారి నుంచి ఆ భూములు సేకరించి 2011లో 38 మంది గిరిజన రైతులకు వాటిని అందజేశారు. అందులో ముచ్చిక వెంకటేశ్వరరావుకు ఆరు ఎకరాలు, బాల మురళీకృష్ణకు 8 సెంట్లు అందజేశారు. అప్పటికి భూములు సేకరించిన ప్రాంతంలో పునరావాస కాలనీ పూర్తి కాకపోవడంతో పాత గ్రామం నుంచి అంత దూరం వెళ్లి వ్యవసాయం చేయలేక ప్రభుత్వం ఎవరి వద్ద భూములు కొనుగోలు చేసిందో ఆ రైతులకే గిరిజనులకు కౌలుకు ఇచ్చారు. 2016లో ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావడంతో పాత గ్రామం నుంచి గిరిజన నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. ముచ్చిక వెంకటేశ్వరరావు, బాల మురళీకృష్ణలకు అప్పుడు తెలిసింది తమకు కేటాయించింది కొండ అని.. దాంతో అధికారుల వద్దకు పరుగులు దీశారు.

తండ్రి మరణంతో..

తండ్రి వెంకటేశ్వరరావు 2017లో మరణించడంతో కుమారుడు ముచ్చిక శివకృష్ణ భూముల కోసం కార్యాలయాలు చుట్టు తిరుగుతూ మంచి భూమి ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు. పోలవరం తహసీల్దార్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీవో, ఐటీడీఏ పీవో, ఏలూరు కలెక్టర్‌ వరకు వెళ్లి ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించక తప్పలేదన్నాడు.


రెండో దశలో వారిదీ అదే పరిస్థితి

ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండో దశలో ఖాళీ చేసిన 19 గ్రామాల్లో ములగలగూడెం ఒకటి. గ్రామంలోని 15 మంది రైతుల కోసం 34 ఎకరాలు బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలో సేకరించారు. ఇప్పటివరకు తమకు ఆ భూములు అందజేయలేదు. కొనుగోలు చేసిన రైతులకు పరిహారం ప్రభుత్వం చెల్లించకపోవడంతో గ్రామం నుంచి బయటకు వచ్చిన తమ పరిస్థితి దయనీయంగా మారిందని మిడియం వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని