logo

వైకాపాలో లుకలుకలు

కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది.   వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి.

Updated : 29 Mar 2024 04:42 IST

‘చింతలపూడి’లో చల్లారని అసమ్మతి
కామవరపుకోట ఎంపీపీ సహా ప్రజాప్రతినిధుల రాజీనామా

కామవరపుకోట వైకాపా మండల అధ్యక్షుడికి రాజీనామా పత్రం అందజేస్తున్న ఉప ఎంపీపీ గిరిజ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు

కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది.   వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. విజయలక్ష్మి తన రాజీనామా పత్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు మిడతా రమేశ్‌కు బుధవారం రాత్రి అందజేశారు. ఈమెతో పాటు నియోజకవర్గ వైకాపా ముఖ్య నాయకుడు, చింతలపూడి ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మేడవరపు అశోక్‌ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరికి మద్దతుగా మండల వైస్‌ ఎంపీపీ టి.గిరిజ, ఎంపీటీసీ సభ్యుడు బి.సత్యనారాయణ, సొసైటీ ఛైర్మన్‌ కనకరాజు, వీరభద్రస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌ తుమ్మలపల్లి శ్రీను, మరి కొందరు వార్డు సభ్యులు, నాయకులు గురువారం తమ రాజీనామాలను అందజేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ వీరిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

వర్గ విభేదాలు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలీజా, ఎంపీ కోటగిరి శ్రీధర్‌ల మధ్య వర్గ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలీజా వర్గంగా ఉన్న కొందరు వైకాపా నాయకులకు ప్రస్తుతం ఎంపీపీ విజయలక్ష్మి మద్దతుదారుల మధ్య నెలకొన్న వైరమే ఈ రాజీనామాలకు కారణంగా చెబుతున్నారు. ప్రత్యర్థి వర్గంలోని కొందరు చింతలపూడి వైకాపా అభ్యర్థి విజయరాజు బంధువు మోసేనురాజును ఇటీవల కలవడం వివాదానికి తెర లేపినట్లుగా సమాచారం. వైకాపాలో బలమైన వర్గంగా ఉన్న మేడవరపు అశోక్‌, ఆయన సన్నిహితులు బాహాటంగా రాజీనామాలకు తెరతీయడంతో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని పార్టీలోని నేతలు మదనపడుతున్నారు.


నాయకుల అసంతృప్తి

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి చల్లారడంలేదు. ఇటీవలే ఎమ్మెల్యే  ఎలీజా వైకాపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వైకాపా అభ్యర్థి విజయరాజు వ్యవహారం తమకు నచ్చడం లేదని నియోజకవర్గంలోని కొందరు వైకాపా నాయకులు ఎంపీ శ్రీధర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఏలూరులోని ఎంపీ నివాసానికి కొందరు వైకాపా నాయకులు వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే ఎలీజాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకే ప్రస్తుత అభ్యర్థి విజయరాజు మద్దతు పలుకుతున్నారంటూ వీరంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని విజయరాజుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని