logo

ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి

మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి.

Published : 18 Apr 2024 03:48 IST

ఎస్‌ఐ కొట్టడంతోనే చనిపోయాడని ఆందోళన

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. ఇతను మద్యం విక్రయాలు చేస్తున్నాడని ఈ నెల 16వ తేదీ పెద్దపంజాణి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేయగా మదనపల్లె సబ్‌జైలుకు పంపారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో మొగిలప్ప సబ్‌జైలులోనే కుప్పకూలిపోయాడు. దీంతో మదనపల్లె సబ్‌జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణ యాదవ్‌, సిబ్బంది ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను పెద్దపంజాణి ఎస్‌ఐ శ్రీనివాసులు కొట్టాడని భార్య రెడ్డెమ్మ ఆరోపించారు. ఆ దెబ్బలు తాళలేకే మరణించారని రోదిస్తూ చెప్పారు. సోమవారం సాయంత్రం స్టేషన్‌కు తీసుకెళ్లారని, తాము ఎలాంటి మద్యం వ్యాపారాలు చేయకున్నా ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తే సమాధానం కూడా చెప్పలేదని ఆమె తెలిపారు. స్టేషన్‌కు వెళితే అప్పటికే తన భర్తను తీవ్రంగా కొట్టారని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తీసుకెళ్లి మంగళవారం ఉదయాన్నే స్టేషన్‌కు తీసుకు రావాలని చెప్పారన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు వెళితే ఆలస్యంగా వచ్చారని మళ్లీ కొట్టారని ఆమె అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గంజాయి కేసు పెడుతానని ఎస్‌ఐ బెదిరించినట్లు చెప్పారు.  

ఆసుపత్రి ఎదుట ఆందోళన

మొగిలప్ప కుటుంబానికి న్యాయం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకుడు యామలా సుదర్శనం, గుండా మనోహర్‌, మోహన్‌, సంఘం నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పెద్దపంజాణి ఎస్‌ఐపై, మొగిలప్పకు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడిపై, మదనపల్లె సబ్‌జైలు సూపరింటెండెంట్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సుమారు 3 గంటల పాటు బంధువులకు మృతదేహాన్ని చూపించకుండా నిర్లక్ష్యం చేసిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ వల్లిబసు, రెండో పట్టణ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్యలు ఆసుపత్రి వద్దకు చేరుకుని వారికి సర్ధి చెప్పారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌, తహసీల్దార్‌ రమాదేవి తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకుని మొగిలప్ప శరీరంపై గాయాలు ఉన్నాయా? అని పరిశీలించారు. మొగిలప్ప మృతిపై పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని