logo

Cyber Crime: ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్లు సెర్చ్‌.. సొమ్ము మాయం

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మొబైల్‌ఫోన్లు మొరాయించినా, క్రెడిట్‌కార్డు సమస్య తలెత్తినా కస్టమర్‌ కేర్‌ ద్వారా పరిష్కరించుకుంటున్నారు

Updated : 22 Jan 2022 08:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మొబైల్‌ఫోన్లు మొరాయించినా, క్రెడిట్‌కార్డు సమస్య తలెత్తినా కస్టమర్‌ కేర్‌ ద్వారా పరిష్కరించుకుంటున్నారు. ఇందులో అధికశాతం మంది కస్టమర్‌కేర్‌ నంబరును అంతర్జాలంలో వెతుకుతుంటారు. అదే సైబర్‌ మాయగాళ్లకు అవకాశంగా మారింది. ఆ నంబర్లను నమ్మి లావాదేవీలో నెరిపితే బ్యాంకులో సొమ్మంతా ఖాళీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇలా పోగొట్టుకుంటున్న బాధితుల్లో 90 శాతం ఐటీ నిపుణులు, 10 శాతం ఉన్నత విద్యావంతులు కావటం గమనార్హం. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇదే తరహా ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి.

ఎలా చేస్తున్నారంటే..
అంతర్జాలంలో ఎవరెవరు ఏయే నంబర్ల కోసం గాలించారనే సమాచారం సైబర్‌ నేరస్థులు సేకరిస్తున్నారు. స్పూఫింగ్‌ ద్వారా కస్టమర్‌ కేర్‌ నంబర్లను ఉపయోగించి బాధితులతో మాట్లాడతారు. వారికి అవసరమైన సేవలకు కొద్దిమేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ మొబైల్‌ నంబర్లకు సందేశం(మెస్సేజ్‌) పంపుతారు. బాధితులు దాన్ని  క్లిక్‌ చేయగానే వారు ఉపయోగించే సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ల్లో ఎనీ డెస్క్‌, టీమ్‌ వ్యూయర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. బాధితులు నిర్వహించే ఆన్‌లైన్‌ లావాదేవీలన్నీ అటువైపు నుంచి సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఫోన్‌ ద్వారా ఒకరు మాట్లాడుతున్నప్పుడే, అతడి పక్కనే ఉన్న మరో సహాయకుడు ఎనీడెస్క్‌, టైమ్‌ వ్యూయర్‌ సాయంతో బాధితుల బ్యాంకు ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి వారి ఖాతాలోని నగదు మొత్తం స్వాహా చేస్తారు. బాధితులు గ్రహించేలోపే కొట్టేసిన నగదును రెంటల్‌ యాప్‌ ద్వారా నగదుగా మార్చుకుంటారు.

ఇలా మోసపోయారు
* మాదాపూర్‌ ఐటీ సంస్థలో ఉన్నతోద్యోగి. జియో సిమ్‌కార్డు సతాయించటంతో అంతర్జాలంలో కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతికారు. అందులో ఓ నంబరు కనిపించింది. దానికి ఫోన్‌చేస్తే కలవలేదు. కొంతసేపటికే అదే నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తర్వాత వారు ఓ లింక్‌ పంపించి రూ.10 దాని ద్వారా పంపించమన్నారు. ఆ లింకు నొక్కి, వారి ఆదేశాలు పాటించడంతో ఖాతాలోని రూ.20 లక్షలు మాయమయ్యాయి.

* గచ్చిబౌలికి చెందిన విద్యావంతుడు. కార్పొరేట్‌ సంస్థలో ఉన్నత కొలువు. బ్యాంకు డెబిట్‌/క్రెడిట్‌కార్డు సేవల కోసం కస్టమర్‌కేర్‌ నంబరు కోసం అంతర్జాలంలో గాలించి ఫోన్‌ చేశాడు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో వదిలేశాడు. మరుసటి రోజు అదే నంబరు నుంచి ఫోన్‌కాల్‌. క్రెడిట్‌కార్డు సేవలు నిలిపివేస్తున్నామంటూ బెదిరింపు. వెంటనే కొద్దిమేర నగదు చెల్లించి పునరుద్ధరించుకొనే అవకాశం ఇస్తామంటూ సలహా. అతడు అటు వైపు నుంచి వచ్చిన ఆదేశాలను అమలుపరిచాడు. రూ.7.5 లక్షలు పోగొట్టుకున్నాడు.

* కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి క్రెడిట్‌కార్డ్‌ రద్దు చేసుకొనేందుకు కస్టమర్‌కేర్‌కు ఫోన్‌ చేశాడు. కొంత సమయానికే మరో నంబరు నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తాము ఖాతాదారుల సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నామని లింక్‌ పంపారు. దాని ద్వారా వివరాలు తీసుకుంటూ బ్యాంకు ఖాతా నంబరు, ఓటీపీ సేకరించి రూ.లక్ష కాజేశారు.


ఆ నంబర్లు అంతర్జాలంలో వెతకొద్దు
-జి.శ్రీధర్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్‌ సైబరాబాద్‌

ప్రస్తుతం వస్తున్న సైబర్‌ నేరాల ఫిర్యాదుల్లో 20 శాతం ఇవే ఉంటున్నాయి. వినియోగదారుల సేవలకు ఆయా సంస్థలు ఉపయోగిస్తున్న కస్టమర్‌కేర్‌ నంబర్లనే నేరస్తులు స్పూఫింగ్‌ పద్ధతిలో వాడటంతో బాధితులు అనుమానించలేకపోతున్నారు. కస్టమర్‌కేర్‌ నంబరు కోసం అంతర్జాలంలో వెతకవద్దు. సంబంధిత సంస్థల వెబ్‌సైట్‌ల నుంచి తీసుకోండి. సైబర్‌నేరస్తుల చేతిలో మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే డయల్‌ 100, టోల్‌ఫ్రీ నంబరు 155260, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ 9490617310కు ఫోన్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని