logo

ఇయర్‌బడ్స్‌ తరహాలో కొకైన్‌

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ టోనీ నుంచి కొకైన్‌ తీసుకుంటున్న వినియోగదారులకు బంజారాహిల్స్‌లో పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌

Updated : 21 Apr 2022 12:33 IST

టోనీ గ్యాంగ్‌ సభ్యులకు పోలీసుల తాఖీదులు

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులతో వారికి సంబంధాలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ టోనీ నుంచి కొకైన్‌ తీసుకుంటున్న వినియోగదారులకు బంజారాహిల్స్‌లో పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులకు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. ముంబయి నుంచి టోనీ పంపుతున్న కొకైన్‌ను వినియోగిస్తున్న ఇద్దరు నిందితులు సంజయ్‌ గద్దపల్లి, సోమశశికాంత్‌ తరచూ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ను కలుసుకునేవారని పోలీసులు పామ్‌(పుడింగ్‌ అండ్‌ మింక్‌)యాప్‌ ద్వారా తెలుసుకుని.. వీరిద్దరికి తాఖీదులు జారీ చేశారు. గురువారం బంజారాహిల్స్‌ ఠాణాకు హాజరుకావాలని పేర్కొన్నారు. కోర్టు అనుమతితో అభిషేక్‌, అనిల్‌లను నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అభిషేక్‌ చరవాణుల్లో కాల్‌డేటాను విశ్లేషించగా.. శశికాంత్‌, సంజయ్‌లతో ఛాటింగ్‌ చేసినట్లు తెలుసుకున్నారు. అభిషేక్‌ కూడా అంగీకరించడంతో వారిద్దరికి తాఖీదులు పంపించారు. మరో 40 నుంచి 50 మంది వరకు అభిషేక్‌తో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.

కొకైన్‌.. ఆఫ్రికన్‌ ప్యాకింగ్‌ .. బంజారాహిల్స్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొంతమందికి వారాంతాల్లో కొకైన్‌ సరఫరా చేస్తున్నారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పబ్‌లో స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను పరిశీలించగా.. ఎవరికి అనుమానం రాకుండా ఆఫ్రికన్లు రవాణా చేసే పద్ధతిలోనే ఇక్కడికి పంపించారని తెలుసుకున్నారు. చెవుల్లో పడ్డ దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకునే ఇయర్‌బడ్స్‌ తరహాలో కొకైన్‌ను ప్యాక్‌ చేశారని, వాటిని చూస్తే ఇయర్‌బడ్స్‌ అని భ్రమించేలా ఉన్నాయని గుర్తించారు. కొకైన్‌ పొట్లాలను పబ్‌లోని ఓ కౌంటర్‌ వద్ద కనిపించేలా ఉంచినా అవి వస్తువులేనని అక్కడున్న వారు అనుకున్నారని పోలీసులు తెలుసుకున్నారు.

మరికొందరికి..

మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్‌ పోలీసులు మరికొందరికి తాఖీదులు ఇవ్వనున్నట్లు తెలిసింది. టోనీ నుంచి కొకైన్‌ కొనుగోలు చేసిన జయచందర్‌, అలోక్‌జైన్‌ల పేర్లు ఇందులో ఉన్నాయి. సంజయ్‌, శశికాంత్‌లను విచారించిన తర్వాత తాఖీదులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. వీరిలో కొందరు పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొకైన్‌ లభించినప్పుడు లేరని పోలీసులు భావిస్తున్నారు. పబ్‌కు వస్తున్న వారిలో 15 మంది డ్రగ్స్‌ తీసుకొని, వినియోగిస్తున్నట్టు అభిషేక్‌, అనిల్‌లకు సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వారి అనుమతితో రక్తనమూనాలు సేకరించాలనుకుంటున్నారు. ఈ నెల 2న రాత్రి పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లోకి డ్రగ్స్‌ ఎవరి ద్వారా వచ్చాయనేది తేల్చడానికి వీరిని విచారించనున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు. కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ సరఫరా, వినియోగంపై దృష్టి సారించిన తమకు.. టోనీ ద్వారా కొకైన్‌ నెట్‌వర్క్‌ గురించి తెలిసిందని, డ్రగ్స్‌ కొనుగోలుదారులు ఇంకా ఉండొచ్చన్న భావనతో పరిశోధన కొనసాగిస్తున్నామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని