logo

సోయి లేకే ప్రమాదాలు

పరిమితికి మించి మద్యం తాగి విచక్షణ కోల్పోయి కారు అతి వేగంగా నడుపుతుండడంతో నగరంలో తరచూ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు

Published : 08 Dec 2021 03:06 IST

పరిమితికి లోబడి తాగితే వాహనం నడపొచ్చు
మోటారు వాహన చట్టం చెబుతోందిదే

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: పరిమితికి మించి మద్యం తాగి విచక్షణ కోల్పోయి కారు అతి వేగంగా నడుపుతుండడంతో నగరంలో తరచూ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు ఎంత మద్యం తాగి వాహనాలు నడపొచ్చు? ఎంత తాగితే రక్తంలో ఆల్క్‌హాల్‌ శాతం పెరుగుతుంది? అసలు మద్యం తాగి వాహనం నడపడం గురించి మోటారు వాహనం చట్టం ఏమి చెబుతోందని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

30మి.గ్రా దాటితే..
మోటారు వాహన చట్టం 185 ప్రకారం 100 మిల్లీ లీటర్ల రక్తంలో ఆల్కహాల్‌ గాఢత(బీఏసీ) 30 మిల్లీ గ్రాములలోపే ఆల్క్‌హాల్‌ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సంబంధిత వాహనదారుడు నిరభ్యంతరంగా వాహనాన్ని నడపడానికి చట్టం అనుమతి ఇచ్చింది. దీనికి మించితాగి వాహనం నడిపితే నేరం చేసినట్లే. ఒక సాధారణ బీరు తాగిన వ్యక్తి అరగంట లోపులోనే బయటకు వస్తే అతడ్ని పరీక్షిస్తే 30 బీఏసీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మద్యం 30 ఎంఎల్‌ తాగితే 40 బీఏసీ వస్తుంది. 60 ఎంఎల్‌ పెగ్గు తాగిన పది నిమిషాల్లోనే రోడెక్కి పోలీసులకు పట్టుబడితే అతని రక్తంలో 100 బీఏసీ ఉంటుందని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. సాధారణంగా యువత రక్తంలో 150 బీఏసీ ఉంటే చాలా వరకు అతడి మెదడు పని చేయని పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద వారిలో కూడా 150 -200 బీఏసీ ఉంటే పెద్దలు కూడా స్పృహలో ఉండరని చెబుతున్నారు. బార్‌లో మద్యం తాగిన తర్వాత నాలుగు గంటలపాటు అక్కడే ఉండి బయలుదేరితే బీఏసీ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు తెలిపారు.

నియంత్రణలో ఉంటామనేది భ్రమ: డా.వై.శ్రీనివాస్‌, హెచ్‌వోడీ, మానసిక ఆరోగ్య విభాగం, కాకతీయ మెడికల్‌ కళాశాల
మద్యం తాగేప్పుడు చాలామంది మంది తాము నియంత్రణ కోల్పోం.. బాగా డ్రైవింగ్‌ చేయగలమని చెబుతుంటారు. ఇదంతా భ్రమ మాత్రమే. పైగా మద్యం తాగినందువల్ల వేగంగా నడుపుతారు. మద్యపానంతో మెదడు నియంత్రణలో ఉండదు. కాళ్లు, చేతులపై పట్టు ఉండదు. ముందు ఏ వాహనం వెళ్తుందో.. ఎంత దూరంలో ఉంటుందో సరైన అంచనా ఉండక ప్రమాదానికి కారణమవుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని