logo

చూపులేనివారికి.. దారిచూపుతూ!

సాంకేతికత సహకారంతో చూపులేని వారికి దారి చూపుతూ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి పునరావాస సేవల కేంద్రం అండగా నిలుస్తోంది. పలు ఐటీ ఇతర సంస్థల సహకారంతో పునరావాస కేంద్రంలో అంధులకు శిక్షణ ఇవ్వడం...వారికి ఈ సేవల వినియోగం గురించి అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.

Published : 20 May 2022 02:49 IST

సాంకేతిక సహకారంతో అంధులకు అండ

ఎల్వీ ప్రసాద్‌ నేత్ర ఆసుపత్రిలో ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతికత సహకారంతో చూపులేని వారికి దారి చూపుతూ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి పునరావాస సేవల కేంద్రం అండగా నిలుస్తోంది. పలు ఐటీ ఇతర సంస్థల సహకారంతో పునరావాస కేంద్రంలో అంధులకు శిక్షణ ఇవ్వడం...వారికి ఈ సేవల వినియోగం గురించి అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. పూర్తిగా చూపులేని వారికే కాకుండా స్వల్ప దృష్టి మాంద్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా సాంఘిక, విద్యా, వృత్తిపర పునరావసం వరకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. కొన్ని పరికరాలను ఇక్కడే రూపకల్పన చేస్తున్నారు. వాటిని వాడటం నేర్పిస్తున్నారు. చూపులేదని కుంగిపోయి..ఆత్మవిశ్వాసం కోల్పోయి..ఎవరి మీదో ఆధారపడకుండా ఎవరి కాళ్లపై వారు మనగలిగేలా తీర్చిదిద్దుతున్నారు. నాణ్యమైన, స్వతంత్ర జీవితాన్ని గడపడానికి అవసరమైన సాంకేతికత సహకారం అందించడం ఈ పునరావాస సేవల కేంద్రం లక్ష్యం. గ్లోబల్‌ యాక్సెసిబిలిటీ అవేర్నెస్‌ డే పురస్కరించుకొని గురువారం ఆసుపత్రిలో అంధులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు సందర్శకులు పరికరాలను ఆసక్తిగా పరిశీలించి...అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు. ఆ పరికరాలు ఏమిటో ఒకసారి చూద్దాం..

దారి చూపే స్మార్ట్‌కేన్‌: అంధత్వం, దృష్టిలోపం ఉన్నవారు ఒక సన్నని పొడవాటి కర్ర లాంటి పరికరం(మొబిలీటీ కేన్‌) ఉపయోగించి నడుస్తుంటారు. రోడ్లు దాటుతుంటారు. అలాంటిదే ఈ స్మార్ట్‌కేన్‌. దీన్ని చేతిలో పట్టుకొని ముందుకు పోవడం...లేదంటే మొబిలిటీ కేన్‌కు బిగించి నడవటం ద్వారా దాన్నుంచి వచ్చే సిగ్నల్స్‌ ముందున్న వస్తువును 3 మీటర్ల ముందే గుర్తించి శబ్దంతో అప్రమత్తం చేస్తుంది.

బ్రెయిలీ టైప్‌ రైటర్‌: కంటిచూపు లేని వారు ఏదైనా చదవటానికి, రాయటానికి బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంది. ఎల్వీపీలో దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బ్రెయిలీ లిపిలో సమాచారం క్రోడీకరించి అవి అంధులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. బ్రెయిలీలో లిపిని టైప్‌ రైటర్‌ ద్వారా నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

ఆట వస్తువులు: అంధత్వం ఉన్న చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో సుడోకు, స్నేక్‌ అండ్‌ ల్యాడర్‌ లాంటి బుర్రకు పదును పెట్టే ఆటలను రూపొందించారు. బ్రెయిలీలో పేకముక్కలను తయారు చేశారు. బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా బొమ్మలపై బ్రెయిలీలో పేర్లు ఉంటాయి. ముట్టుకున్న వెంటనే ఆ బొమ్మపేరు ఏంటో తెలుస్తుంది. స్పర్శతో జంతువు ఎలాఉంటుందో తెలిసిపోతుంది.

యూ రీడ్‌ స్కానర్‌: ఈ స్కానర్‌ కింద ఏదైనా పుస్తకం లేదా పేపరు పెట్టినప్పుడు అందులో సమాచారం అంతా స్కాన్‌ చేసి వాయిస్‌ ఓవర్‌ ద్వారా విన్పిస్తుంది. వింటూ నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. పీడీఎఫ్‌ ఫైల్‌ను కూడా రూపొందిస్తుంది. ప్రస్తుతం ఆంగ్లంతోపాటు మిగతా భాషల్లోనూ ఇవి అందుబాటులోకి తేనున్నారు. దీనిని ఉపయోగించే తీరుపై ఇక్కడ తర్ఫీదు ఇవ్వనున్నారు.

అంధులకు ప్రత్యేకంగా... తక్కువ కంటిచూపు ఉన్నవారు కంప్యూటర్‌ను వినియోగించుకునేలా కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. జేఏడబ్ల్యూఎస్‌(జాస్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా విండోస్‌లోని ఐకాన్లు పెద్దవిగా కనిపిస్తాయి. స్క్రీన్‌ రీడర్‌ సాయంతో వాటి గురించి తెలుసుకునే వీలు ఏర్పడుతుంది. తద్వారా సులువుగా కంప్యూటర్‌ను వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.


ఆ యాప్‌.. అంధులకు కంటిచూపు!


యాప్‌ పనితీరును చూపుతున్న యువతి

ఈనాడు, హైదరాబాద్‌: అంధులు ఉపయోగించేందుకు వీలుగా...వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇప్పటికే పలు యాప్‌లకు రూపకల్పన చేశాయి. మానవీయ కోణంలో ఆయా సంస్థలు ఉచితంగా వీటి సేవలను అందిస్తున్నాయి. ‘గూగుల్‌ లుక్‌ అవుట్‌’ ‘మనీ అప్లికేషన్‌’ ‘స్క్రీన్‌ రీడర్‌’ లాంటి యాప్‌లు ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించారు. ప్లేస్టోర్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్ఛు వీటికి భిన్నంగా తాజాగా ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని ప్రాంతాల్లో అంధుల కోసం దీనిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. విజయవంతం కావడంతో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ సేవలు అందించడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. గురువారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఈ యాప్‌ సేవల గురించి వివరించారు.

* ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాప్‌తో ఎవరి సహాయం లేకుండానే అంధులు ఎక్కడైనా తిరిగే వీలు ఏర్పడనుంది.

* కార్యాలయంలో ఎక్కడ ఏ క్యాబిన్‌ ఉంది...మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నాయి..మాల్స్‌లో ఏ షాపు ఎటు వైపు ఉంది...ఇలాంటి సమాచారం ఎవరో ఒకరు చెబితే తప్ఫ.సొంతంగా అంధులు గుర్తించలేరు. ఇలా సమయంలోనే ఈ యాప్‌ వారికి ఒక దారి చూపుతుంది. పలు ఇతర ఉపయోగాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని