icon icon icon
icon icon icon

Congress: కేసీఆర్‌ను నమ్మితే పద్మారావు మునిగినట్టే: సీఎం రేవంత్‌

సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవబోతోందని, కేంద్రంలో కాంగ్రెస్‌ రాబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Apr 2024 14:39 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘‘ఆనాడు దత్తాత్రేయని ఓడించి.. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌లో మూడు రంగుల జెండా ఎగరేశారు. అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్‌ 3 రంగుల జెండా ఎగరేయబోతున్నారు. దానం గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించబోతున్నారు. భాజపా నాయకులు గెలిచి కేంద్ర మంత్రులు అయినా హైదరాబాద్‌కు చేసిందేమిటి? వరదలు వచ్చి హైదరాబాద్‌ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి నగరానికి చిల్లిగవ్వ తేలేదు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కాంగ్రెస్సే కారణం.

భారాస అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ.. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. అతని పరువు తీయడానికే సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్‌, కేసీఆర్‌ ఎందుకు రాలేదు? ఆయనకు వాళ్లు మద్దతు ఇవ్వడంలేదు. సికింద్రాబాద్‌ టికెట్‌ను భాజపాకు తాకట్టు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాది.  నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం.. ఇందుకు కేటీఆర్‌ సిద్ధమా? భారాసకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దే. మత సామరస్యాన్ని కాపాడింది మా పార్టీ.  దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడిని  ప్రధాని మోదీ బజారులోకి తీసుకొచ్చారు. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని భాజపా చూస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img