icon icon icon
icon icon icon

దళిత, గిరిజనులను జగన్‌ బిచ్చగాళ్లలా చూశారు

ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు.

Published : 05 May 2024 06:46 IST

ఆయన పాలనలో చేసిందంతా దగానే
అట్టడుగువర్గాలపై దాడులు జరుగుతున్నా మౌనం
అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ప్లేట్‌ ఫిరాయింపు
ఎస్సీ, ఎస్టీలెవరూ వైకాపాకు ఓటేయొద్దు
వర్గీకరణకు తెదేపా హామీ.. అందుకే కూటమికి మద్దతు
‘ఈనాడు’తో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ  
ఈనాడు, అమరావతి

ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. తెదేపా ప్రభుత్వం తెచ్చిన 27 ప్రత్యేక పథకాలను రద్దు చేయడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో చేసిందంతా మోసమేనన్నారు. దళితులపై వైకాపా నేతలు అరాచకాలకు తెగబడుతున్నా ఏనాడూ అడ్డుకట్ట వేయలేదని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కోసం ఒక్క ప్రత్యేక పథకాన్నీ అమలు చేయని జగన్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ సందర్భంగా రాష్ట్రం తరఫున న్యాయవాదిని నియమించాలని జగన్‌ను కోరినా పట్టించుకోలేదన్నారు. దళిత, గిరిజనులను అన్నిరకాలుగా అణగదొక్కేందుకే ప్రయత్నించారని విమర్శించారు. ఆత్మగౌరవమున్న ఏ దళితుడు, గిరిజనుడు జగన్‌కు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. శనివారం ‘ఈనాడు’తో ఆయన మాట్లాడారు.

చంపేసి డోర్‌డెలివరీ చేసే స్థాయికి దళితులపై దాడులు

దళిత యువకుణ్ని చంపి డోర్‌ డెలివరీ చేసే స్థాయికి దాడుల తీవ్రతను జగన్‌ పెంచారు. ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌ వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. దళితులకు శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష పడితే.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించారు. దళితులకు ఇంతకు మించిన అవమానం ఏముంటుంది?

మాస్క్‌ అడగటమే దళిత డాక్టర్‌ నేరమా?

డాక్టర్‌ సుధాకర్‌ ఏ నేరం చేశారని శారీకరంగా, మానసికంగా వేధించి పొట్టన పెట్టుకున్నారు. కరోనా కాలంలో సరైన మాస్కులు లేవని అడిగినందుకు దళిత డాక్టర్‌ను మండుటెండలో చేతులు వెనక్కి విరిచి నడిరోడ్డుపై పడుకోబెట్టి హింసిస్తారా? ఈ ఘటనలు తలచుకున్నప్పుడుల్లా ఇలాంటి బతుకులు ఇప్పటికీ బతుకున్నామని కుమిలిపోతున్నాం.

రేషన్‌ బియ్యం కూడా  ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సాయమేనా?

రేషన్‌ బియ్యం అన్ని వర్గాల పేదల కోసం దశాబ్దాలుగా అమలు చేస్తున్న పథకం. జగన్‌ ఆ పథకంలోని ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల సంఖ్యను పక్కకు తీసి, అదే ప్రత్యేక సాయమన్నట్టుగా లెక్కలు చూపించడం దుర్మార్గం. జగన్‌ అన్ని పథకాల్లోనూ ఇలాగే ఎస్సీ, ఎస్టీలను దెబ్బతీశారు.  

మద్య నిషేధం  చేయకుండా ఓట్లడుగుతారా?

మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ మాట తప్పారు. పైగా సొంత కంపెనీలు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారు. కల్తీ మద్యంతో లక్షల మంది అనారోగ్యం పాలయ్యేలా చేశారు. వేల మంది మరణించారు. ఇక జగన్‌కు ప్రజల్ని ఓట్లడిగే హక్కు ఎక్కుడుంది?  

నిరుద్యోగ యువతను వలసబాట పట్టించారు

అమరావతిని విధ్వంసం చేసి, ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత జగన్‌దే. ఐదేళ్లలో ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి పూర్తిగా కనుమరుగైంది. పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించకుండా మాటలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలనూ తరిమికొట్టారు. ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి తెచ్చారు.


వర్గీకరణపై జగన్‌ మోసం

చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే మాదిగలకు, ఉపకులాలకు 22 వేల ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. ఉన్నత విద్యలో న్యాయమైన వాటా దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన స్వర్ణయుగం అయితే జగన్‌ పాలన నవ్యాంధ్రకు శాపం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా వర్గీకరణ కోసం కృషి చేశారు. జగన్‌ మాత్రం గత ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటించి, తర్వాత ప్లేట్‌ ఫిరాయించేశారు. వర్గీకరణ ఇప్పుడు మళ్లీ కీలక దశకు చేరింది. మోదీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాసనసభలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వ్యవస్థల్లో మాదిగలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం.


దళిత, గిరిజనులు అభివృద్ధి  చెందకూడదనేది జగన్‌ ఎత్తుగడ

ఎస్సీ, ఎస్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, పథకాలు అమల్లోకి తెచ్చి.. వారి కోసం ఖర్చు చేశాయి. కానీ జగన్‌ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధుల్ని ఇతర కార్యక్రమాలకు యథేచ్ఛగా మళ్లించారు. వారికి ఏళ్లుగా అందుతున్న ప్రత్యేక సాయానికి పాతరేశారు. అందరికీ వర్తింపజేసే పథకాలనే వారికీ ఇస్తూ దాన్నే గొప్పగా ప్రచారం చేశారు. ఎస్సీ, ఎస్టీలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదనే ఆలోచనతోనే ఇదంతా చేశారు. నిధులు కేటాయించకుండా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img