icon icon icon
icon icon icon

మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!

ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్‌ బుక్‌’ ఉందని హెచ్చరించారు.

Published : 05 May 2024 06:46 IST

చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్‌బుక్‌
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, కడప: ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్‌ బుక్‌’ ఉందని హెచ్చరించారు. నాయకులను తయారుచేసే కర్మాగారం తెదేపా అని పేర్కొన్నారు. రాజంపేటలో శనివారం యువగళం సభలో లోకేశ్‌ మాట్లాడారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసి.. అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని, అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అంటే అసాంఘిక శక్తులకు హడల్‌ అని, ప్రజాప్రభుత్వం రాగానే ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను ఏరేస్తామని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక గంజాయి, నాసిరకం మద్యం పెరిగాయని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అసాంఘిక కార్యకలాపాలను ఆణచివేస్తామని స్పష్టం చేశారు. ‘2019 వరకు నాపై ఒక్క కేసూ లేదు. వైకాపా పాలనలో 23 కేసులు పెట్టారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. సింహం బయటకు వచ్చాక జగన్‌ను వేటాడుతోంది. ఈ లోకేశ్‌ సైతం తగ్గేదే లేదు. బాంబులకు భయపడని కుటుంబం మాది.. చిల్లర కేసులకు భయపడతామా? తండ్రిని అడ్డం పెట్టుకుని నేను సిమెంట్‌ పరిశ్రమలు, పత్రిక, టీవీ ఛానల్‌ పెట్టలేదు. నీతి నిజాయతీలే మాకు శ్రీరామరక్ష. అధికారులు రాజ్యాంగ బాధ్యతలను నిష్పక్షపాతంగా నెరవేర్చాలి. కొందరు చట్టాలను అధికార పార్టీకి చుట్టంగా మార్చారు. అలాంటివారికి గుణపాఠం చెప్పేందుకే రెడ్‌ బుక్‌ పెట్టాను’ అని పునరుద్ఘాటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జ్యుడిషియల్‌ విచారణ చేయించి సర్వీసు నుంచి డిస్మిస్‌ చేస్తామని.. చేసిన తప్పులకు జైలుకు పంపి తీరుతామని హెచ్చరించారు. సభకు వేల మంది యువతీ యువకులు హాజరై లోకేశ్‌తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలు ప్రశ్నలు అడిగారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యానికి ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌, కార్యదర్శి చప్పిడి మహేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img