icon icon icon
icon icon icon

మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది.

Updated : 05 May 2024 07:16 IST

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. గ్రామస్థులు, మహిళలు తాగునీటి సమస్యపై ఎమ్మెల్యేను నిలదీశారు. వారానికోసారి గ్రామంలో తాగునీరు సరఫరా చేస్తే వేసవిలో గొంతులు ఎలా తడుపుకోవాలని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకోవడం తెలుసు, సమస్యలు పట్టించుకోవడం తెలియదా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వస్తారు. ఆపై కన్నెత్తి చూడరంటూ మహిళలు విమర్శించారు. రంగాపురం గ్రామంలో మహిళలు తాగునీటి సమస్యపై ప్రచార రథంపై ఉన్న బాలనాగిరెడ్డిని ప్రశ్నించారు. మరోసారి తనను గెలిపిస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు: చిన్నకడబూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రచారంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సర్పంచి అనసూయమ్మ అదే గ్రామానికి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు జామ రాజేశ్వరి వర్గాల మధ్య ఎమ్మెల్యేను గ్రామంలోకి స్వాగతించే విషయంలో కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే జడ్పీటీసీ సభ్యురాలి వైపు మొగ్గు చూపడంతో సర్పంచి వర్గీయులు ఎమ్మెల్యేపై ఆగ్రహానికి గురై వైకాపా జెండాలను తగలబెట్టడానికి ప్రయత్నించారు. కొన్ని జెండాలను రోడ్డుపై పడేసి కాళ్లతో తొక్కే ప్రయత్నం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలనాగిరెడ్డి సర్పంచి వర్గీయులను సముదాయించి ఆయన వారి దారిలోనే గ్రామంలోకి ప్రవేశించడంతో గొడవ సద్దుమనిగింది. సభ ముగిశాక గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. గ్రామంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి అందరినీ అదుపుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img