icon icon icon
icon icon icon

జగన్‌ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?

సీఎం జగన్‌ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు.

Published : 05 May 2024 06:46 IST

ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుదల
ఎన్డీయే నేతలు యామినీశర్మ, శివశంకర్‌, ఆనంద్‌సూర్యల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించనపుడు పోలీసు వ్యవస్థ ఉండి ఎందుకని నిలదీశారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌సూర్య, జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌లతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గత అయిదేళ్లలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల కేసుల్లో ఎంతమందికి శిక్షలు వేశారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తామన్నారు. ఒక్క కేసులోనైనా అలా జరిగిందా? వైకాపా అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో నేరాల రేటు పెరిగింది. జగన్‌ పాలనలో సుమారు 650 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. నా అక్క చెల్లెమ్మలంటూ ప్రతి సభలోనూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం తప్ప వారి భద్రత కోసం చేసిందేమీ లేదు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 22 వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమయ్యారు. ఈ వ్యవహారంలో డీజీపీ ఏమీ జరగలేదని ప్రకటించడం బాధాకరం. త్వరలోనే రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తుంది. నేరం చేసిన వారి తాట తీస్తుంది’ అని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులే బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. విశాఖలో ఫ్యాక్షన్‌ పరిచయం చేశారు. తిరుపతిలో తుపాకీ గురిపెట్టి మరీ ఆస్తులు లాక్కున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు’ అని జనసేన, తెదేపా నేతలు శివశంకర్‌, ఆనంద్‌సూర్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం, అనకాపల్లిలో భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యామినీశర్మ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img