icon icon icon
icon icon icon

ఇదీ ‘జగనాసుర రక్త చరిత్ర’

‘వైకాపా మ్యానిఫెస్టో బూటకం.. సీఎం జగన్‌ పెద్ద అబద్ధాల కోరు’ అని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 26 Apr 2024 05:44 IST

ఒక్క అవకాశం అంటూ వచ్చి విధ్వంసం సృష్టించారు
మరో ఛాన్స్‌ అంటుంటే జనం వణికిపోతున్నారు
జగన్‌ అరాచక పాలనపై ఎన్డీయే ఛార్జిషీట్‌

ఈనాడు, అమరావతి: ‘వైకాపా మ్యానిఫెస్టో బూటకం.. సీఎం జగన్‌ పెద్ద అబద్ధాల కోరు’ అని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి.. నేడు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరుతో రూపొందించిన ఎన్డీయే ఛార్జిషీటును తెదేపా నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబు, జనసేన నేతలు టి.శివశంకర్‌, పి.గౌతమ్‌, భాజపా నేతలు పేరాల శేఖర్‌రావు, లంకా దినకర్‌లు తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చి విధ్వంసం సృష్టించారని, జగన్‌ మరో ఛాన్స్‌ అంటుంటే జనం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ‘వారంలో సీపీఎస్‌ రద్దు  చేస్తానన్నారు. పేదలకు 25 లక్షల ఇళ్లు కడతానన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రభుత్వ ప్రేరేపిత అరాచకత్వాన్ని పెంచిపోషించారు’ అని ఆరోపించారు. ‘రూ. 2.75 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశానని జగన్‌ అంటున్నారు. వాస్తవానికి ఆయన రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్కో వ్యక్తిపై రూ. 3 లక్షల చొప్పున భారం మోపారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు’ అని టి.శివశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఓ సిండికేట్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇసుక, భూములు, గనులు, మద్యం, రేషన్‌బియ్యం ఇలా అన్నీ దోచుకున్నారని పేరాల శేఖర్‌రావు మండిపడ్డారు. 99 శాతం హామీల్ని అమలు చేశామని ప్రజల్ని మభ్యపెడుతున్నారని లంకా దినకర్‌ అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే వారిని దగా చేశారని గౌతమ్‌ ధ్వజమెత్తారు.

ఛార్జిషీట్‌ ఎందుకంటే?

  •  కోడికత్తి డ్రామాలాడి దళిత యువకుడిని, గులకరాయి డ్రామాతో బీసీ యువకుడిని జైలుపాలు చేశారని ఎన్డీయే నేతలు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మొత్తం 50 అంశాలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. కావాలని పింఛన్ల పంపిణీలో జాప్యం చేసి అవ్వాతాతల మరణాలకు కారకులయ్యారని, శవరాజకీయాలు చేశారని విమర్శించారు.
  •  అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక.. దుష్ప్రచారం చేయించినందుకు..
  •  ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ. 10 లక్షల భారం మోపినందుకు, పెట్రోలు, డీజిల్‌ ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు..
  •  రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాలకు కేంద్రంగా మార్చినందుకు.. భూమి, గనులు, ఎర్రచందనం, రేషన్‌ బియ్యం రూపంలో రూ.8 లక్షల కోట్లు కొట్టేసినందుకు..
  •  సొంత చెల్లి పుట్టుకపై నిందలేసి.. తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించినందుకు..
  •  14 లక్షల ఎకరాల ఎసైన్డ్‌ భూములు కబ్జా చేసినందుకు..
  •  ఇసుక దోచుకుని, ధర 4 రెట్లు పెంచి 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతీసినందుకు, వివిధ వర్గాల వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీసినందుకు..
  •  అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టినందుకు..
  •  పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, చంద్రన్న బీమా.. తదితర 100 పథకాలు రద్దు చేసినందుకు..
  •  మద్యనిషేధం చేశాకే ఓట్లడుగుతా, విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తా, మెగా డీఎస్సీ వేస్తా, సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పి.. 85% హామీలపై మాట తప్పినందుకు
  •  మ్యానిఫెస్టో హామీలు 99.5% అమలు చేశానని అబద్ధాలు చెబుతున్నందుకు..
  •  అమ్మఒడికి రూ.13 వేలిచ్చి నాన్న బుడ్డిలో రూ.లక్ష కొట్టేస్తూ.. పేదల్ని మోసం చేస్తున్నందుకు..
  •  చిన్నాన్నను గొడ్డలితో క్రూరంగా నరికి చంపినవారిని కాపాడుతున్నందుకు..
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను 600 మందిని హత్యచేయించినందుకు..
  •  ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించినందుకు..
  •  ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి.. 42 మంది ప్రాణాలు పోగొట్టినందుకు..
  •  రుషికొండకు బోడిగుండు కొట్టించి.. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములు కబ్జా చేసినందుకు..

  మద్యంలో కొట్టేసింది రూ.లక్ష కోట్లు

మద్యనిషేధం హామీ ఇచ్చి బ్లాక్‌మార్కెట్‌ అమ్మకాలతో రూ.లక్ష కోట్ల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందనేది నిజం కాదా జగన్‌రెడ్డీ అని ఛార్జిషీట్‌లో వైకాపా సర్కారును ఎన్డీయే ప్రశ్నించింది. రాష్ట్రంలో 2019 నుంచి విషపూరిత మద్యం తాగించి 35 లక్షల మంది ఆరోగ్యాలు పాడుచేసి 30 వేల మంది మరణాలకు జగన్‌ కారకులయ్యారని.. తెదేపా పాలనలో మద్యం అమ్మకాలు రూ.72 వేల కోట్లు ఉంటే వైకాపా పాలనలో రూ. 1.31 లక్షల కోట్లకు చేరాయని వివరించింది.

 పేదల బియ్యం బొక్కిన వైకాపా నేతలు

చంద్రబాబు పాలనలో రేషన్‌ దుకాణాల ద్వారా 9 రకాల సరకులు పంపిణీ చేస్తే.. జగన్‌ వచ్చాక బియ్యం తప్ప మరేమీ అందడం లేదని ఛార్జిషీట్‌లో ఎన్డీయే వివరించింది. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బొక్కేసి.. కాకినాడ పోర్టు నుంచి ఎన్నడూ లేనంతగా ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తున్నారని ధ్వజమెత్తింది.

  10 సార్లు కరెంటు ఛార్జీల బాదుడు 

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 10 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి, కరెంటు కోతలు పెట్టారని, రూ.75 వేల కోట్ల భారం వేశారని ఛార్జిషీట్‌లో ఎన్డీయే పేర్కొంది. ‘స్మార్ట్‌ మీటర్ల పేరుతో వినియోగదారుల మీద భారీగా భారాన్ని వేయడం దుర్మార్గం. ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు’ అని వివరించింది. ‘కేంద్రం వద్దని వారించినా.. పోలవరంలో రివర్స్‌ టెండర్‌ పిలిచి.. అక్కడ ఉత్పత్తి కావాల్సిన 960 మెగావాట్ల జలవిద్యుత్తుకు గండికొట్టారు’ అని తెలిపింది.

ఉప ప్రణాళిక నిధులు లక్ష కోట్ల మళ్లింపు

అయిదేళ్లలో జగన్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉప ప్రణాళిక నిధుల్ని ఖర్చు చేయకుండా మళ్లించింది. నవరత్నాల్లో కలిపి చూపించింది. ఇది ఆయా వర్గాలకు ద్రోహం చేయడమే’ అని ఛార్జిషీట్‌లో వివరించింది. ‘వాహనమిత్రతో రూ. 10 వేలు ఇచ్చి.. డీజిల్‌ ధరల పెంపు, పోలీసు జరిమానాలు, గ్రీన్‌ట్యాక్స్‌ తదితరాల రూపంలో ఏడాదికి రూ.లక్ష కొట్టేస్తున్నారు’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img