icon icon icon
icon icon icon

వైకాపా రౌడీ రాజకీయాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా రౌడీ రాజకీయాలకు తెర లేపింది. వివిధ జిల్లాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితులు సృష్టిస్తోంది.

Published : 08 May 2024 05:13 IST

వివిధ జిల్లాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత రెచ్చిపోతున్న వైనం 

ఈనాడు, యంత్రాంగం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా రౌడీ రాజకీయాలకు తెర లేపింది. వివిధ జిల్లాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితులు సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు కళంకాయల యంకయ్య, శ్రీనివాసరావు, మరికొందరు సోమవారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే వాళ్ల ఇళ్ల ఎదురుగా వైకాపా నాయకులు బండి శంకర్‌, తెల్లమేకల లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, చక్రవర్తి వేచి ఉన్నారు.

మా ఇళ్ల దగ్గర మీకేం పని అని యంకయ్య ప్రశ్నించడంతో ఒక్కసారిగా అతడిని కొట్టారు. యంకయ్య కుమారుడు శ్రీనివాసరావు, పగడాల వెంకటరావమ్మ అడ్డురాగా వారిపైనా కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తెదేపా తరఫున ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ బెదిరించారు. బాధితులను కుటుంబ సభ్యులు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసరావును గుంటూరుకు తరలించారు.

  • పల్నాడు జిల్లా నూజండ్ల మండలం రాముడుపాలెంలో కొద్దిరోజులుగా తెదేపా, జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం వైకాపా నేతలున్న వీధిలో ప్రచారం చేయడానికి వెళ్లారు. దీంతో వైకాపా నాయకులు భీమవరపు బాలకొండలు, కొట్టె వెంకట సుబ్బారావు కలిసి తెదేపా కార్యకర్త మల్లయ్యపై దాడి చేయబోయారు. అక్కడే ఉన్న తెదేపా నేత వెంకటేష్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కత్తితో దాడి చేశారు.
  • శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురంలో రాప్తాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సునీత మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. ప్రచార వాహనం గ్రామంలోకి రాగానే వైకాపా కార్యకర్తలు శ్రీకాంత్‌, రఘు, రామ్మోహన్‌, నరేశ్‌ కలిసి ఓ ఇంటిపై నుంచి రాళ్లు విసిరారు.
  • ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులో తెదేపా నాయకుడు శెట్టినేని సత్యనారాయణ సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వైకాపా నాయకులు.. సత్యనారాయణపై రాయితో దాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ వర్గీయులైన ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు అందం సత్యనారాయణ, మరికొందరితో కలిసి శెట్టినేని సత్యనారాయణ గత నెల 19న తెదేపాలో చేరారు. దీంతో కక్ష పెంచుకుని దాడి చేశారని బాధితుడు వాపోయారు.
  • పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నాయకుడు మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువజామున తగులబెట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img