icon icon icon
icon icon icon

మోదీ మాటలతో సీఎంకు వణుకు పుట్టింది

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా సాగించిన అవినీతి, అరాచక పాలనపై రాజమహేంద్రవరం, అనకాపల్లి సభల్లో ప్రధాని మోదీ మాట్లాడటంతో సీఎం జగన్‌ వెన్నులో వణుకు పుట్టిందని భాజపా నేతలు ఎద్దేవా చేశారు.

Published : 08 May 2024 05:18 IST

భాజపా నేతల వ్యాఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా సాగించిన అవినీతి, అరాచక పాలనపై రాజమహేంద్రవరం, అనకాపల్లి సభల్లో ప్రధాని మోదీ మాట్లాడటంతో సీఎం జగన్‌ వెన్నులో వణుకు పుట్టిందని భాజపా నేతలు ఎద్దేవా చేశారు. ఆ మాటలకు తట్టుకోలేకే మంత్రి బొత్స సత్యనారాయణతో జగన్‌ అసత్యాలు చెప్పిస్తున్నారని మండిపడ్డారు. ‘రైల్వే జోన్‌పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు’ అని బొత్స చేసిన వాఖ్యలపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, అధికార ప్రతినిధులు సాదినేని యామినీశర్మ, ఆర్‌డీ విల్సన్‌, సుధీష్‌ రాంభొట్ల మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘రాజమహేంద్రవరం, అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీయే సభలతోనే జగన్‌ ఓటమి ఖరారైంది. రాష్ట్రానికి రైల్వే జోన్‌ మంజూరు చేసినా.. వైకాపా ప్రభుత్వం నిర్మాణ యోగ్యమైన భూములివ్వకుండా తాత్సారం చేసింది. సీఎం జగన్‌ ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధిని అటకెక్కించారు. లెక్కలేనంత అవినీతి చేశారు’ అని లంకా దినకర్‌ ధీమా వ్యక్తంచేశారు.

 తప్పు చేశారు కాబట్టే భయం...

‘భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుండటంతో వైకాపా నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తప్పు చేశారు కాబట్టే వాళ్లు భయపడుతున్నారు. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు తన బొమ్మ పెట్టుకుని జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారు’ అని యామినీశర్మ విమర్శించారు. దళితుడిని హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆర్‌డీ విల్సన్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img