icon icon icon
icon icon icon

వైకాపా ఇసుకాసురుడి ఖాతాలోకి మైనింగ్‌ సొమ్ము!

మైనింగ్‌ లీజుల ఈ-వేలం సొమ్ము దారి మళ్లించిన కేసులో వైకాపాకు చెందిన ఇసుక సిండికేట్‌ నిర్వాహకుడు జి.రామకృష్ణ కీలకమని తెలుస్తోంది.

Updated : 08 May 2024 07:13 IST

ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన రామకృష్ణ
గనుల శాఖలో ఈ-వేలం సొమ్ము దారి మళ్లించడంలో కీలకం
రాజమహేంద్రవరంలో మూడేళ్లుగా పడవ ర్యాంపుల సిండికేట్‌ నిర్వాహకుడు ఆయనే

ఈనాడు, అమరావతి: మైనింగ్‌ లీజుల ఈ-వేలం సొమ్ము దారి మళ్లించిన కేసులో వైకాపాకు చెందిన ఇసుక సిండికేట్‌ నిర్వాహకుడు జి.రామకృష్ణ కీలకమని తెలుస్తోంది. ఆయన సంస్థ ఖాతాలోకే రూ.5 కోట్ల మేర మళ్లించి వినియోగించుకున్నట్లు బయటపడుతోంది. గనుల శాఖ కొత్త లీజులకు నిర్వహించే ఈ-వేలంలో పాల్గొనేవారు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ను నొక్కేశారు. గనులశాఖ సంచాలకుడి కార్యాలయంలోని ఐటీ విభాగంలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు ఇదంతా చేశారు. ఈ సొమ్మును గుంటూరు జిల్లా పెదకాకాణి ప్రాంతానికి చెందిన వైకాపా నేత గూడూరు రామకృష్ణకు చెందిన ఆర్కే ట్రేడ్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌లోకి మళ్లించారు. తర్వాత ఈ సొమ్ము అంతా కలిసి వాడుకున్నారు. దాదాపు ఏడాదిగా ఈ దందా సాగినట్లు తెలిసింది.

ఎవరీ రామకృష్ణ?

రామకృష్ణ కొంతకాలంగా ఇసుక వ్యాపారంలో ఆరితేరారు. గతంలో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా ఇసుక వ్యాపారం జరిగినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రవాణా కాంట్రాక్టు తీసుకున్నారు. తర్వాత టర్న్‌కీని వైకాపా పెద్దలు వెల్లగొట్టాక ఆయన నేరుగా వ్యాపారంలోకి దిగారు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల గోదావరి నదిలో పడవ ర్యాంపుల ద్వారా ఇసుక వ్యాపారం సిండికేట్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. నెలకు రూ.9-10 కోట్ల చొప్పున ప్రభుత్వ పెద్దలకు చెల్లిస్తూ అంతకు ఎన్నో రెట్లు ఇసుక వ్యాపారం చేసి లాభపడేవారని సమాచారం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు సన్నిహితులంటూ వారితో కలిసి దిగిన ఫొటోలను అందరికీ చూపించేవారని తెలుస్తోంది. సీఎం జగన్‌ ఫ్లెక్సీలతోనూ ప్రచారం చేసుకునేవారు. గతంలో జీఎస్టీని ఎగ్గొట్టేందుకు టర్న్‌కీ సంస్థ తమ అక్రమ సొమ్మును పలు ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు చెల్లించినట్లు చూపించి తర్వాత వారి నుంచి వెనక్కి తీసుకుంది. ఇందులో ఆర్కే ట్రాన్స్‌పోర్టు కూడా ఉంది. తాజాగా మైనింగ్‌ సొమ్ము నొక్కేసిన కేసులో రామకృష్ణ పాత్ర బయటపడటంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

సంధాని దొరికితే.. దోపిడీపై స్పష్టత

గనుల శాఖ ఐటీ విభాగంలో పనిచేసే సంధాని, రెడ్డి శేఖర్‌, మరో ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులు తెలివిగా సెక్యూరిటీ డిపాజిట్ల సొమ్ము దారి మళ్లించారు. ఇందులో రెడ్డి శేఖర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన సంధాని పరారీలో ఉన్నారు. ఆయన పట్టుబడితే కుంభకోణం విలువ తెలుస్తుందని సమాచారం. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటుచేశారు. గనులశాఖ సంచాలకుడి కార్యాలయంలో లీజుల ఈ-వేలం కోసం వివిధ అధికారులకు చెందిన 15-20 డాంగిల్స్‌ను ఐటీ విభాగంలో ఉంచినట్లు తెలిసింది. వీటినే అక్కడి పొరుగుసేవల ఉద్యోగులు దుర్వినియోగం చేసి సొమ్ము దారి మళ్లించారు. అధికారుల వద్ద ఉండాల్సిన డాంగిల్స్‌ను ఐటీ విభాగంలో ఎందుకు ఉంచారనేదీ ప్రశ్నార్థకమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img