icon icon icon
icon icon icon

జగన్‌ ముస్లిం ద్రోహి

గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ప్రభుత్వంలో ముస్లింల మీద కిరాతకంగా దాడులు జరిగాయని కుల్‌ హింద్‌ తన్జీమ్‌ ముఫ్తియాన్‌ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 08 May 2024 06:58 IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన పాలనలో హత్యలు, దాడులు
తెదేపాకు ‘కుల్‌హింద్‌ తన్జీమ్‌ ముఫ్తియాన్‌’ మద్దతు 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ప్రభుత్వంలో ముస్లింల మీద కిరాతకంగా దాడులు జరిగాయని కుల్‌ హింద్‌ తన్జీమ్‌ ముఫ్తియాన్‌ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయని, వారి జనాభా ఎక్కువగా ఉన్న అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం వస్తేనే ముస్లింల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. అందుకే ఈ ఎన్నికల్లో తెదేపాకు తమ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో కుల్‌ హింద్‌ తన్జీమ్‌ ముఫ్తియాన్‌ ప్రధానకార్యదర్శి షేక్‌ ఉల్‌ హదీస్‌ అల్లమా ముఫ్తీ జియా ఉల్లాఖాన్‌ ఖాసిమి, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్‌, ఏపీ విభాగం అధ్యక్షుడు ముఫ్తీ ఇస్మాయిల్‌ ఖాసిమి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్‌ షిబ్లీ తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం, గౌరవవేతనం ఇవ్వడం, 50 ఏళ్లకే పింఛన్‌ సహా ముస్లింల సంక్షేమానికి తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మించాలని, ఇస్లాం కల్చరల్‌ సొసైటీ కోసం భూములివ్వాలని ఈ సందర్భంగా కోరినట్లు తన్జీమ్‌ ముఫ్తియాన్‌ ప్రతినిధులు తెలిపారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, అన్ని హామీల్నీ నెరవేరుస్తానని, 4 శాతం రిజర్వేషన్లను కాపాడతానని భరోసా ఇచ్చారని వారు వెల్లడించారు.

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే మేలు

‘‘రాజధానిగా అమరావతిని కొనసాగిస్తేనే అన్ని వర్గాలకు.. ప్రత్యేకించి ముస్లింలకు మేలు జరుగుతుంది. అమరావతి పరిధిలోని గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో కలిపి సుమారు 9 లక్షల ముస్లిం జనాభా ఉంది. రెండు నగరాల్లో ఉన్న ఆటోనగర్‌లలో పెద్ద ఎత్తున ముస్లింలు ఉపాధి పొందుతున్నారు’’ అని ఉల్లాఖాన్‌ ఖాసిమి తెలిపారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అనుభవం నేడు రాష్ట్రానికి అవసరమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దియోబంద్‌ కేంద్రంగా ‘కుల్‌ హింద్‌ తన్జీమ్‌ ముఫ్తియాన్‌’ సంస్థ ముస్లింల కోసం పనిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img