icon icon icon
icon icon icon

ఇన్నేళ్లూ వివేకా హత్యకేసు దోషులను ఎందుకు తేల్చలేదు?

‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత గానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉంటే కేసు సీˆబీఐకి వెళ్లకముందే సీఎం హోదాలో 11 నెలల పాటు ఎందుకు దోషులను తేల్చలేకపోయారు’ అని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

Published : 26 Apr 2024 09:10 IST

జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌
పులివెందులలో నామినేషన్‌ దాఖలు చేసిన దస్తగిరి

వేంపల్లె, న్యూస్‌టుడే: ‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత గానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉంటే కేసు సీˆబీఐకి వెళ్లకముందే సీఎం హోదాలో 11 నెలల పాటు ఎందుకు దోషులను తేల్చలేకపోయారు’ అని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని మినీ సెక్రటేరియట్లో గురువారం ఆ పార్టీ అభ్యర్థిగా వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం దస్తగిరితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘11 నెలలుగా మీ ఆధ్వర్యంలోనే పోలీసులు ఉన్నా వివేకాను ఎందుకు హత్య చేశారు, డబ్బుల కోసం ఎవరైనా చేయించారా, లేక ఆస్తి కోసం రెండోభార్య చేయించారా అని ఎందుకు తేల్చలేకపోయారు? ఈ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన అబద్ధాలను రాష్ట్ర ప్రజలు, పులివెందుల, కడప ప్రజలు తెలుసుకోవాలి. హత్యకేసు నిందితుడైన దస్తగిరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఎందుకిచ్చారని చాలామంది అడుగుతున్నారు. దస్తగిరి కోర్టు ముందుకు వెళ్లి తాను నేరం చేశానని, ఏ శిక్ష వేసినా భరిస్తానని ఒప్పుకొన్న సాక్షి. ఓ వ్యక్తి మరణాన్ని, ఓ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని అలుసుగా తీసుకుని 2019లో అధికారాన్ని సాధించి 2024లో మళ్లీ అధికారాన్ని సాధించాలనే ఆలోచన కచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ అని జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలను అడిగితే చెబుతారు

మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో, ఎవరు చంపించారో ప్రజలను అడిగితే చెబుతున్నారని జై భీమ్‌ భారత్‌పార్టీ పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి, వివేకా హత్య కేసు అప్రూవర్‌ దస్తగిరి అన్నారు. ‘జగన్‌.. పులివెందుల సభలో ఏదో చెబుతున్నారు.. ధైర్యముంటే ప్రజలకు మైకు ఇచ్చి వివేకానందరెడ్డి హత్యపై ఎలాంటి అనుమానాలు ఉన్నాయో అడిగితే తెలుస్తుంది. నేను పులివెందుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నేను ఈ రోజు 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభించాల్సి ఉంది. సీఐ ఫోన్‌ చేసి 2.30 గంటలకు ర్యాలీ, నామినేషన్‌ పెట్టుకోవాలని చెప్పారు. లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇందుకు నేను అంగీకరించాను. నేను నామినేషన్‌ వేయకపోతే రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారు. నామినేషన్‌ వేస్తే మైనారిటీ ఓట్లు పోతాయని చెప్పారు. దాంతో తాము ఇబ్బంది పడతామని ఎంపీ అవినాష్‌రెడ్డి, జగన్‌రెడ్డి అనుచరులు చెప్పినా నేను నిరాకరించాను’ అని చెప్పారు. పులివెందుల ప్రజలు ఓట్లు వేసి తనని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img