icon icon icon
icon icon icon

ప్రచారం చేస్తున్నామని తప్పుడు కేసులు

ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన తమని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని తెదేపా ఎన్నారై విభాగం నేతలు ధ్వజమెత్తారు.

Published : 27 Apr 2024 05:59 IST

తెదేపా ఎన్నారై నేతల ధ్వజం
‘ఎన్‌రైజ్‌ ఏపీ క్యాంపెయిన్‌’ వాహనాల ప్రారంభం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన తమని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని తెదేపా ఎన్నారై విభాగం నేతలు ధ్వజమెత్తారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న తమ పార్టీ ఎన్నారై విభాగం నాయకుల్ని పోలీస్‌స్టేషన్లకు పిలిచి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నారై విభాగం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యాలు పెంచి, యూరప్‌, అమెరికా, గల్ఫ్‌ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘ఎన్‌రైజ్‌ ఏపీ క్యాంపెయిన్‌’ వాహనాల్ని ఆ పార్టీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి జెండా ఊపి ప్రారంభించారు. ‘‘ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్‌ పాలనలో జరిగిన నష్టంపై యువతలో చైతన్యం తీసుకువస్తాం. గతంతో పోల్చుకుంటే ఈ సారి తెదేపా తరఫున ప్రచారం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పోస్టులు పెడుతున్న ఎన్నారైలపై కేసులు పెడుతున్నారు. స్వదేశంలో విమానం దిగితే చాలు అరెస్టు చేస్తున్నారు. ప్రవాసాంధ్రులుగా మాకున్న సౌకర్యాలు.. సామాన్యులకూ కలగాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి’’ అని రవి స్పష్టం చేశారు.

అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తామని తెదేపా ఎన్నారై గల్ఫ్‌ అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు. ‘ఎన్‌రైజ్‌ ఏపీ క్యాంపెయిన్‌’ విధివిధానాల్ని ఆయన వివరించారు. ‘‘ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్ర- తూర్పు,పశ్చిమగోదావరి- ప్రకాశం,కృష్ణా, గుంటూరు- రాయలసీమ, నెల్లూరు జిల్లాల్ని నాలుగు భాగాలుగా విభజించాం. నాలుగు బృందాలు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తాయి. రోజుకు మూడు నియోజకవర్గాలకు వెళతాయి. స్థానిక ఎన్డీయే అభ్యర్థులతో కలిసి ప్రచారంలో బృంద సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ఎన్డీయే ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తారు’’ అని రాధాకృష్ణ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు సీఎం అయితే ఎన్నారై విభాగం తరఫున లక్ష ఉద్యోగాలు మేమే ఇస్తాం. మా విభాగంలో సుమారు 5 వేల మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఒక్కొక్కరు 20 మందికి ఉద్యోగాలిచ్చినా సులువుగా లక్ష అవుతాయి. ఇవి కాక మా రిఫరెన్స్‌ల ద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని చూడలేకే వేల డాలర్ల సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నట్లు మరో ఎన్నారై సభ్యుడు తెలిపారు.

వైకాపా ఎమ్మెల్యే సతీమణి ఉన్న ఊళ్లో ప్రచారం చేశానని కేసు పెట్టారు

‘‘తెదేపా తరఫున ప్రచారం చేస్తున్న నాపై పల్నాడు జిల్లా క్రోసూరులో కేసు పెట్టారు. అందుకు కారణం.. స్థానిక వైకాపా ఎమ్మెల్యే సతీమణి ఉన్న ఊళ్లోకి ప్రచారానికి వెళ్లడమే. ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు కోసం పనిచేస్తాం. యువత భవిత కోసమే మేము వచ్చాం’’ అని భానుప్రకాశ్‌ (వాషింగ్టన్‌ డీసీ) తెలిపారు. కార్యక్రమంలో బుచ్చిరాంప్రసాద్‌, కానూరి శేషుబాబు(అమెరికా), కోడూరి వెంకట్‌ (కువైట్‌) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img