icon icon icon
icon icon icon

సాయి ధరమ్‌తేజ్‌ లక్ష్యంగానే వైకాపా వర్గీయుల దాడి!

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆదివారం వైకాపా శ్రేణులు చేసిన దాడి సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ లక్ష్యంగానే జరిగినట్లు తేటతెల్లమవుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వహించగా.. ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.

Published : 07 May 2024 05:19 IST

ఇద్దరు నిందితుల అరెస్టు, బెయిల్‌పై విడుదల
తాటిపర్తి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆదివారం వైకాపా శ్రేణులు చేసిన దాడి సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ లక్ష్యంగానే జరిగినట్లు తేటతెల్లమవుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వహించగా.. ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. దీని నుంచి ఆయన తప్పించుకున్నప్పటికీ ఆ పక్కనే ఉన్న నల్లల శ్రీధర్‌ అనే యువకుడి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాటిపర్తికి చెందిన ఉంగరాల వెంకటరమణ, ఉంగరాల వీరబాబు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, శిక్షణ డీఎస్పీ ప్రమోద్‌, ఎస్సై బాలాజీ సోమవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు అనుమతి పొంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే వైకాపా వర్గీయులు అక్కడకు వచ్చి మోటారుసైకిల్‌తో విన్యాసాలు చేయడం, బాణసంచా కాల్చడమేమిటనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. బందోబస్తు, ఘటన అనంతర చర్యలపైనా పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేసుకు సంబంధించి నామమాత్రపు సెక్షన్‌లు నమోదు చేయడాన్ని జనసేన, తెదేపా నాయకులు తప్పుబడుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని వైకాపా నాయకుల ఒత్తిడితోనే స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. కేసు వివరాలను కోర్టుకు నివేదించగా స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతో బెయిల్‌ ఇచ్చినట్లు ఎస్సై చెబుతున్నారు. సినీ నటుడిపై కానీ, ఆయన వాహన శ్రేణిపై కానీ ఎటువంటి భౌతిక దాడులూ జరగలేదని, వారిని అడ్డుకున్న ఘటనలు కూడా ఏమీ లేవని డీఎస్పీ డా.కె.హనుమంతరావు అన్నారు. అసత్యాలు ప్రచారం చేయొద్దని సూచించారు.

రౌడీయిజంతో బెదిరిస్తే ఉపేక్షించబోం: నాగబాబు

వైకాపా మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేదిలేదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఈసీ అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సాయి ధరమ్‌తేజ్‌పై వైకాపా శ్రేణులు దాడికి యత్నించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img