icon icon icon
icon icon icon

ఏప్రిల్‌ నుంచే పింఛను రూ.4 వేలు

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్‌ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

Published : 06 May 2024 05:50 IST

దివ్యాంగులకు రూ.6 వేలు..
ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల పెంచిన మొత్తాలూ ఇస్తాం
అంగళ్లు, అనంతపురం సభల్లో చంద్రబాబు

ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్‌, అనంతపురం: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్‌ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పెంచిన సొమ్మును ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు కలిపి ఒకేసారి ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇంటికే తీసుకువచ్చి మొదటి తేదీనే పంపిణీ చేయిస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాళ్లు, చేతులు లేనివారికి రూ.15 వేలు చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు, అనంతపురం నగరంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెంచిన నగదును ఇస్తానని చెబుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఎప్పుడో 2028లో రూ.250 చొప్పున పెంచి ఇస్తామని చెబుతున్నారు. సంపద సృష్టించడం ద్వారా నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పిన మేర సంక్షేమ ఫలాలు అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.
పథకాలు ఆగుతాయని దుష్ప్రచారం చేస్తున్నారు..

‘కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆగుతాయని వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం వస్తే ఆగేది జగన్‌ ఆదాయం మాత్రమే. ఇసుక మాఫియా, మైనింగ్‌ దోపిడీ, ఎర్రచందనం స్మగ్లింగ్‌, గంజాయి, డ్రగ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం ఆయనకు నిలిచిపోవడం ఖాయం. ఈ నెల 13 తర్వాత ఫ్యాను గిరగిరా తిరగదు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమిని కొట్టేశారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో 8 వేల ఎకరాలు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో 10 వేల ఎకరాలు, వాన్‌పిక్‌ సిటీ పేరుతో 28 వేల ఎకరాలు కాజేశారు. విశాఖలో కార్తికవనం, ఎన్‌సీసీ భూములు, హయగ్రీవ భూములను హస్తగతం చేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్‌ అనుకుంటున్నారు. ఆయన చేసిన పాపాలకు ప్రజాకోర్టులో శిక్ష ఖాయం’ అని మండిపడ్డారు.

వైకాపాతో సామాజిక న్యాయం కల్ల

‘నేతి బీరకాయలో నెయ్యి ఎలానో.. వైకాపా చెబుతున్న సామాజిక న్యాయం కూడా అంతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్‌ ప్రభుత్వం చేసిందేం లేదు. వారికి పేరుకే పదవులు ఇచ్చి అధికారం మొత్తం తన చేతుల్లో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చి అన్ని వర్గాలకూ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తాం. వడ్డెర్ల అభివృద్ధికి కృషి చేస్తాం. ఉద్యోగస్థులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు, టీఏ, డీఏలు, పీఆర్సీలు అందిస్తాం’ అని స్పష్టం చేశారు.


ముస్లింలకు రూ.వంద కోట్లతో కార్పొరేషన్‌

‘తెదేపా గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ఏనాడూ ముస్లింలకు అన్యాయం జరగలేదు. వైకాపా పాలనలో అబ్దుల్‌సలీంను ఇబ్బందులకు గురిచేయడంతో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ముస్లింలు మక్కాకు వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థికసాయం చేసే బాధ్యత మాది. దుల్హన్‌ పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం. విదేశీ విద్య ద్వారా ముస్లిం యువతకు చేయూత అందిస్తాం. మసీదుల మెయింటినెన్స్‌కు ఆర్థికసాయం చేస్తాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లింల కోసం రూ.వంద కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం’ అంటూ భరోసా ఇచ్చారు.

‘రాష్ట్రంలో జరిగే దోపిడీల్లో ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగస్వాములు. మద్యం, మైనింగ్‌, భూములు, బెరైటీస్‌, కుప్పంలోని గ్రానైట్‌ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ల అరాచకాలు లెక్కిస్తున్నా.. చిత్రగుప్తుడిలా ప్రతి లెక్కా సరిచేస్తా. తంబళ్లపల్లె నియోజకవర్గానికి వస్తే నాతో పాటు 600 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. మాకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల్ని బతకనిస్తారా..? ఇక్కడి నుంచే సవాల్‌ విసురుతున్నా.. అంగళ్లు వస్తూనే ఉంటా. అడ్డం వస్తే సైకిల్‌తో తొక్కించుకుంటూ పోతా’ అంటూ మంత్రి పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తా’ అని ప్రకటించారు.  జగన్‌ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని చిత్తుగా చేసి.. చెత్తబుట్టలో వేద్దాం అంటూ చించివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img