icon icon icon
icon icon icon

నయా మధ్యతరగతే కీలకం!

కులాలు, మతాలతోపాటు నయా మధ్యతరగతి ఓటర్లు అభ్యర్థుల భవితను తేల్చనున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్‌ జరగనుంది.

Updated : 26 Apr 2024 05:59 IST

కుల, మతాల ప్రాధాన్య పశ్చిమ యూపీ
రెండో విడతలో 8 చోట్ల పోలింగ్‌
బరిలో టీవీ రాముడు, హేమామాలిని
భాజపాకు ఆర్‌ఎల్‌డీ అండ..
ఎస్పీ, బీఎస్పీ విడివిడిగా..
(గౌతంబుద్ధనగర్‌ నుంచి నీరేంద్ర దేవ్‌)

కులాలు, మతాలతోపాటు నయా మధ్యతరగతి ఓటర్లు అభ్యర్థుల భవితను తేల్చనున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. భాజపా అభ్యర్థులైన టీవీ రాముడు అరుణ్‌ గోవిల్‌, మీరాబాయి హేమామాలినితోపాటు కాంగ్రెస్‌ నేత డానిష్‌ అలీ భవితవ్యం తేలనుంది. మరీ ముఖ్యంగా మోదీ కేంద్రంగానే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయనేది నిర్వివాదాంశం.

  • అలీగఢ్‌, బులంద్‌శహర్‌లలో భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
  • మథురా, గాజియాబాద్‌లలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నా ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు పోరాడుతోంది.
  • మథురా, గాజియాబాద్‌, బాగ్‌పత్‌లలో జాట్‌లు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.  
  • సంపదను సమానంగా పంపిణీ చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ గురించి ఈ ప్రాంతాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కుల మతాల క్షేత్రం

పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ కుల మతాల క్షేత్రం. ముస్లింలు, జాట్‌లు అధికంగా ఉంటారు. గుజ్జర్లు, కాశ్యప్‌లు, బ్రాహ్మణులు కూడా గణనీయ సంఖ్యలో ఉంటారు. ఎన్నికలకు ముందు ముస్లింలు, జాట్‌ల ఓట్లు ఇండియా కూటమికి వస్తాయని అనుకున్నారు. కానీ జాట్‌ నేత, ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌధరి ఎన్డీయేలో చేరడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే ఈసారి భాజపాను ఓడించాలనే పట్టుదల స్థానికుల్లో కనిపిస్తోందని కొందరు అంటున్నారు.


ముక్కోణ పోటీ

గౌతంబుద్ధనగర్‌లో మక్కోణ పోటీ నెలకొంది. భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ మహేశ్‌ శర్మ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మహేంద్ర సింగ్‌ నాగర్‌, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్‌ సోలంకీ పోటీ చేస్తున్నారు. 2009లో బీఎస్పీ, 2014, 2019లో భాజపా ఇక్కడ గెలిచాయి. దిల్లీకి దగ్గరగా ఉండే ఈ నియోజకవర్గంలోని ప్రజలు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోందని భావిస్తున్నారు. ఇక్కడ హిందువుల అభిప్రాయమే కీలకమని, అది ముస్లింలను దూరంగా పెట్టడానికే ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. మనం ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంశాల గురించే మాట్లాడతామని, కానీ ప్రజల్లో విశ్వాసం పెంచే సామాజిక నాయకత్వం గురించి మాట్లాడటం లేదని స్థిరాస్తి వ్యాపారి సునీల్‌ భరద్వాజ్‌ అభిప్రాయపడ్డారు. ఆయనతో కొంత మంది ఏకీభవిస్తున్నారు. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. 22ఏళ్ల విద్యార్థిని మాటల్లో చెప్పాలంటే.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలే ముఖ్యమైన అంశం. యోగి వచ్చాక పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆమె తెలిపారు. ఈవ్‌ టీజింగ్‌ అనేది ఉత్తర భారతంలో వ్యాధి లాంటిదని, ముంబయి లాంటి చోట్ల అలాంటిది ఉండదని వెల్లడించారు.


నిరుద్యోగమే సమస్య

తాళాల తయారీలో పేరుగాంచిన అలీగఢ్‌లో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా ఉంది. ధరల పెరుగుదలనూ ఇక్కడి ప్రజలు ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. పౌర సదుపాయాలు, వర్షాలొస్తే నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈసారి భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ సతీశ్‌ కుమార్‌ గౌతమ్‌, సమాజ్‌వాదీ నుంచి బిజేంద్ర సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం మైనారిటీలకు కేంద్రంగా ఉంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలను ప్రజలు తాళం వేసి కూర్చోబెట్టారని, మళ్లీ ఆ పని చేయాలని ఇటీవల అలీగఢ్‌ సభలో ప్రధాని వ్యాఖ్యానించారు.


జాట్‌ల ఆధిపత్యం

బాగ్‌పత్‌లో జాట్‌లదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో ఆర్‌ఎల్‌డీ నుంచి రాజ్‌కుమార్‌ సంగవాన్‌ బరిలో ఉన్నారు. ఇక్కడి 2 లక్షల మంది జాట్‌లు ఆర్‌ఎల్‌డీకి అండగా నిలుస్తుంటారు. ఇక్కడ ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారని సామాజిక కార్యకర్త మోఫిదుల్‌ అభిప్రాయపడ్డారు. మైనారిటీ ఓట్లు మాత్రం ప్రత్యర్థులకు వెళ్తాయని తెలిపారు.


మధ్యలో బీఎస్పీ

అమరోహాలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య బీఎస్పీ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి దానిశ్‌ అలీ గెలిచారు. ఇటీవల ఆయన కాంగ్రెస్‌లో చేరి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఆయనతో భాజపా అభ్యర్థి కన్వర్‌ సింగ్‌ తన్వర్‌ పోటీ తలపడుతున్నారు. బీఎస్పీ నుంచి ముస్లిం అభ్యర్థి ముజాహిద్‌ హుస్సేన్‌ పోటీ చేస్తున్నారు. ఇదే దానిశ్‌ అలీకి ఇబ్బందికరంగా మారింది. భాజపాకు అనుకూలంగా, దానిశ్‌ అలీకి వ్యతిరేకంగా ఓటింగ్‌ జరగానికి వీలుగానే మాయావతి ఇక్కడ అభ్యర్థిని నిలిపారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.


‘రామ’ లబ్ధికి..

అయోధ్య రాముడి ఆవిష్కరణ నుంచి లబ్ధి పొందడానికి వీలుగా మేరఠ్‌లో టీవీ రాముడు అరుణ్‌ గోవిల్‌ను భాజపా పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో కేవలం 4,729 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి గెలిచారు. దీంతో రామ మందిరం అంశం ద్వారా లబ్ధికి అరుణ్‌ గోవిల్‌ను భాజపా తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున సునీత వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్‌ కుమార్‌ త్యాగి పోటీ చేస్తున్నారు.


హిందుత్వ అడ్డా

బులంద్‌శహర్‌లో భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ భోలా సింగ్‌, కాంగ్రెస్‌ తరఫున శివరాం వాల్మీకి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ భాజపా గెలిచింది. ఈ నియోజకవర్గంలో కులాలకు ప్రాధాన్యం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా హిందుత్వ అడ్డాగా పేరొందింది.


మీరాబాయిపైనే భారం

మథురాలో సినీ నటి హేమామాలినినే భాజపా నమ్ముకుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆమెనే ఈసారి అభ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్‌ నుంచి ముకేశ్‌ ధంగర్‌ బరిలో ఉన్నారు. బీఎస్పీ నుంచి సురేశ్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. నటుడు ధర్మేంద్రకు భార్య కావడంతో జాట్‌ ఓటర్లలో హేమామాలినికి పట్టు చిక్కింది. సినిమాల్లో ఆమె పోషించిన మీరాబాయి పాత్ర మరింత గుర్తింపు తెచ్చింది. ఆమె సభల్లో జై రాధే అనే నినాదాలు వినిపిస్తుంటాయి.


ఉత్కంఠ పోరు

దిల్లీకి సమీపంలో ఉండే గాజియాబాద్‌లో కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌కు ఈసారి భాజపా టికెట్‌ ఇవ్వలేదు. అతుల్‌ గార్గ్‌కు భాజపా టికెటిచ్చింది. కాంగ్రెస్‌ నుంచి డాలీ శర్మ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నంద్‌ కిశోర్‌ పుండీర్‌ బరిలో ఉన్నారు. 2014లో తమ రిజర్వేషన్లను ఎత్తేశారని, అగ్నిపథ్‌కు తాము వ్యతిరేకమని జాట్‌ సమాజ్‌ అధ్యక్షుడు వీరేందర్‌ సింగ్‌ ధాకా తెలిపారు. ఎన్నికల బాండ్లు, రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరుతో గాజియాబాద్‌లోని స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.


ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు

 

  • గౌతంబుద్ధనగర్‌
  • బులంద్‌శహర్‌
  • అమరోహా
  • మేరఠ్‌
  • గాజియాబాద్‌
  • బాగ్‌పత్‌
  • అలీగఢ్‌
  • మథురా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img