icon icon icon
icon icon icon

YS Sharmila: ఐదు సంక్రాంతులొచ్చాయి.. జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ?: వైఎస్‌ షర్మిల

ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్‌కు తెలియదా? అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Published : 26 Apr 2024 12:14 IST

తిరువూరు: ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్‌కు తెలియదా? అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా? ఐదేళ్లయింది దాని ఊసే లేదు. మన బిడ్డల భవిష్యత్తుపై జగన్‌ ఆలోచించట్లేదు. మూడు రాజధానులన్నారు.. ఒక్కటీ లేకుండా చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలి. ప్రజలు వైకాపాను నమ్మితే నట్టేట ముంచారు. 

జగన్‌ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది? ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ.3 వేల కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితీ లేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? ఐదు సంక్రాంతులొచ్చాయి.. జాబ్‌ క్యాలెండర్‌ మాత్రం రాలేదు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా? కుంభకర్ణుడైనా 6 నెలలకు లేస్తారు.. జగన్‌ ప్రభుత్వం ఎందుకు మేల్కొనలేదు? ఎన్నికలు దగ్గరపడుతుంటే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు సిద్ధమంటూ వస్తున్నారెందుకు? ఓడిపోవడానికి సిద్ధమేమో. సంపూర్ణ మద్యపాన నిషేధమన్నారు.. కానీ సర్కారే అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారు’’ అని షర్మిల విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img