December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!

రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్‌ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్‌ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.   

Updated : 13 Dec 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటును లక్ష్యంగా చేసుకొని 2001లో ఉగ్రవాదులు చేసిన దాడి (Indian Parliament attack) ప్రతి భారతీయుడి కళ్లలో కదలాడుతూనే ఉంది. 22 ఏళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో తొమ్మిది మంది అమరులు కాగా మరో 18 మంది గాయాలపాలవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉండే పార్లమెంటుపై ఉగ్రవాదుల దుశ్చర్య దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసిరింది. అప్పటి విషాదాన్ని తలచుకుంటున్న రోజునే (December 13, 2001) పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన దాడి ఘటనను గుర్తుచేసుకుంటే..

ఎర్రబుగ్గ కారులో వచ్చి..

పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament winter session) జరుగుతోన్న వేళ.. డిసెంబర్‌ 13, 2001 ఉదయం 11.40గంటలకు ఐదుగురు సభ్యుల ఉగ్రమూక పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్‌తో కూడిన ఓ అంబాసిడర్‌ కారు లోపలికి వచ్చింది. గేటు నంబర్‌ 12వైపు రాగానే అక్కడి భద్రతా సిబ్బందిలో (పార్లమెంట్‌ వాచ్‌ అండ్‌ వార్డ్‌ సెక్షన్‌) ఒకరు ఈ కారును అనుమానించారు. వాహనాన్ని వెనక్కి వెళ్లాలని తేల్చిచెప్పారు. అలాగే దూసుకొచ్చిన కారు, ముందున్న వాహనాన్ని (పార్క్‌ చేసిన అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ వాహనం) ఢీకొట్టింది. అంతలోనే ఆ అనుమానిత కారులో ఉన్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం మొదలుపెట్టారు.

పార్లమెంటులో పొగగొట్టాలు తీసుకువచ్చిన.. ఆ నలుగురు ఎవరు..?

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సైరన్‌ మోగించారు. దాంతో ఆ ప్రాంగణంలోని భవనాల గేట్లన్నీ మూసివేశారు. అప్పటికే ఇరువైపులా జరుగుతోన్న కాల్పులు దాదాపు 30నిమిషాల పాటు కొనసాగాయి. కారులో వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. కానీ, ఆ ఘటనలో ఎనిమిది మంది భారత భద్రతా సిబ్బంది సహా ఓ తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు కాల్పులు జరుగుతోన్న సమయంలో ఉభయసభలు వాయిదా పడినప్పటికీ.. దాదాపు 100 మంది ఎంపీలు, మంత్రులు పార్లమెంటు లోపలే ఉన్నారు.

పాకిస్థాన్‌ కుట్ర..

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థలే పార్లమెంటుపై దాడి జరిపినట్లు స్పష్టమైందని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్‌కే అడ్వాణీ లోక్‌సభలో ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురూ పాకిస్థానీ ఆత్మాహుతి దళాలేనన్నారు. పార్లమెంటుపై దాడికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రపన్నినట్లు పోలీసులు అనుమానించారు. ఈ దాడికి సంబంధించి డిసెంబర్‌ 13న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దుండగులు ఉపయోగించిన కారు, సెల్‌ఫోన్‌ రికార్డుల ఆధారంగా ఈ దాడికి కుట్ర పన్నిన వారిని అరెస్టు చేశారు.

అఫ్జల్‌ గురుకి ఉరి..

ఈ కేసులో మహ్మద్‌ అఫ్జల్‌ గురు, అతడి సమీప బంధువు షౌకత్‌ హుసేన్‌ గురు, షౌకత్‌ భార్య ఆఫ్సాన్‌తోపాటు గిలానీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు అఫ్సాన్‌ను నిర్దోషిగా తేల్చింది. గిలానీ, షౌకత్‌తోపాటు అఫ్జల్‌ గురులకు మరణశిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లిన గిలానీ నిర్దోషిగా బయటకు రాగా.. షౌకత్‌ మరణశిక్షను పదేళ్ల కఠిన కారాగార శిక్షకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాడుల సూత్రధారి అఫ్జల్‌ గురుకు మాత్రం ఊరట లభించలేదు. మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్‌ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అఫ్జల్‌ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో చివరకు ఫిబ్రవరి 9, 2013న దిల్లీలోని తిహాడ్‌ జైలులో అఫ్జల్‌ గురుకి మరణశిక్ష అమలయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని