Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Mar 2023 17:05 IST

1. ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది. పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదని సీఎం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసింది. కర్నూలుకు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్‌కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు

ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి గుజరాత్‌తోని సూరత్‌ కోర్టు(Surat Court) రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భాజపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అధికార యంత్రాంగం రాహుల్‌ గాంధీ గొంతు నొక్కేందుకు యత్నిస్తోందని పార్టీ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌ శర్మ

త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ (IPL 2023)  వల్ల ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తెలిపాడు. ఈ ఏడాది చివర్లో  వన్డే ప్రపంచకప్‌ (World Cup) జరగనుంది.  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) ఫైనల్‌ సైతం ఐపీఎల్‌ అనంతరం జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశ రాజధానిలో ‘పోస్టర్‌’ వార్‌..!

దేశ రాజధానిలో కొంతకాలంగా ఆమ్‌ఆద్మీ పార్టీ (APP), భాజపా (BJP) మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు స్థానిక ఎన్నికలు, నేతలపై కేసుల విషయంలో వివాదం చోటు చేసుకోగా.. తాజాగా అగ్రనేతల పోస్టర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో ఇటీవల పోస్టర్లు వెలిసిన రెండు రోజులకు కేజ్రీవాల్‌ వ్యతిరేక పోస్టర్లు కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం

‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. మాటిచ్చారు సరే.. నెరవేర్చలేదెందుకు అని ప్రశ్నించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీని ట్యాగ్‌ చేస్తూ తన నిరాశను బయటపెట్టింది. ‘‘విరూపాక్ష’తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అద్భుతమైన నటీనటులు, టెక్నీషియన్స్‌తో పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అయితే, ఎస్‌వీసీసీ.. ఎందుకంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. విరూపాక్షలో నా పాత్రను పరిచయం చేస్తూ ఉగాది రోజున ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తామని మాటిచ్చారు. మరి అదెక్కడ?’’ అని ఆమె ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మనసున్న మారాజు ఈ డాక్టర్‌.. ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు!

ఆ డాక్టర్‌ (Doctor) ఓ గైనకాలజిస్ట్‌. ఆడపిల్లలంటే ఆయనకు ప్రాణం. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ముఖం చిట్లించే వారిని తన సర్వీసులో ఎంతో మందిని చూశారు. కానీ, ఆయనకు మాత్రం అమ్మాయి అంటే ‘లక్ష్మీదేవి’తో సమానం. అందుకే తన ఆస్పత్రి (Hospital)లో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు. అంతటి గొప్ప మనసున్న డాక్టర్‌ ఎక్కడున్నారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ ఓటమికి సరిగ్గా 20 ఏళ్లు.. ప్రతి భారతీయుడి గుండె పగిలిన రోజు

అది 2003.. మార్చి 23. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌. 20 సంవత్సరాల తర్వాత రెండోసారి కప్‌ని దక్కించుకోవడానికి భారత్‌కు వచ్చిన అవకాశమది. ఇంకేముంది.. స్టేడియం మొత్తం టీమ్ఇండియా (Team India) అభిమానులతో నిండిపోయింది. మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా అభిమానులు.. మ్యాచ్‌ ముగిసాక తీవ్ర నిస్తేజంలో మునిగిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని