Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 28 Nov 2022 16:55 IST

1. ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నా నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరు: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీం నిరాకరణ

రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నెలరోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై మాత్రమే స్టే విధించింది. అనంతరం ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బొట్టు బిళ్లలు, వత్తుల పేరుతో భారీ మోసం.. రూ.200 కోట్లకు టోకరా!

నగరంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.200కోట్లకు టోకరా వేశారు. ఈ వ్యవహారంలో సుమారు 1100 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏఎస్‌రావునగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌రావునగర్‌లో రావులకొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో సంస్థను స్థాపించాడు. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి యంత్రాలను ఆయన విక్రయించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నడా పంత్‌-యు.. ఇలాగైతే ఎలా? : యువ ఆటగాడిపై క్రిస్‌ శ్రీకాంత్‌ అసంతృప్తి

టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడంటూ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. ఇటీవలి కాలంలో అతడి ప్రదర్శన తననెంతో నిరాశపరుస్తోందని తెలిపాడు. ఈ ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి కొంత విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కిరణ్‌ రిజిజు వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు అసహనం

హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను నెలల తరబడి కేంద్రం పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు, కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం పరోక్షంగా అసహనం ప్రదర్శించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పోలీస్‌ స్టేషన్‌పై దాడి.. 3000 మందిపై కేసులు.. కేరళలో ఉద్రిక్తత

కేరళలో అదానీ ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన కారులు గత రాత్రి విళింజం పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా 3000 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, అల్లర్లు, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అది శ్రద్ధా తల కాదు.. అంజన్‌ది.. వెలుగులోకి మరో హత్య

ఒక హత్య కేసును ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుకోకుండా మరో హత్యకేసును పరిష్కరించారు. శ్రద్ధావాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌ హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి  దిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులు శ్రద్ధా శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో విద్యాసంస్థలకు వ్యాపించిన ఆందోళనలు

చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు మరింత విస్తరించాయి. తాజాగా అవి పలు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో కూడా మొదలయ్యాయి. గత దశాబ్ద కాలంలో చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి ఆందోళనలను చూడలేదు. దాదాపు 50కిపైగా విద్యాలయాల్లో ఇవి జరుగుతున్నాయి. ఉరుమ్‌ఖీలో అగ్ని ప్రమాదం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ ఆందోళనలకు బీజం వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నన్నే పెళ్లి చేసుకోనంటావా? ముక్కలుగా కోసి చంపుతా!

తనతో పెళ్లికి నిరాకరించిన మైనర్‌ బాలిక(17)ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ ఫయాజ్‌ అనే యువకుడు పదేపదే ఓ బాలిక వెంటపడుతుండేవాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెట్టాడు. అయితే, అతడి ప్రతిపాదనను బాలిక నిరాకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని