Updated : 29 May 2022 17:08 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కర్నూల్లోనూ అదే పరిస్థితి.. ‘మమ’ అనిపించిన మంత్రులు

మరో 30 ఏళ్లు రాష్ట్రంలో వైకాపాయే అధికారంలో ఉంటుందని ఏపీ మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సారథ్యంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రలో భాగంగా కర్నూలులోని సీ క్యాంపు కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభా వేదిక వద్దకు అధికారులు తరలించారు.

2. నేను సంపాదించిన విలువైన ఆస్తి... అభిమానులే: బాలకృష్ణ

‘‘నేను సంపాదించిన విలువైన ఆస్తి అభిమానులు. వారు నాపై చూపించే ప్రేమే’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ‘అఖండ’ విడుదలై 175 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బోయపాటి శ్రీను, బాలయ్య పాల్గొన్నారు. తమ చిత్రాన్ని నందమూరి తారకరామారావుకి అంకితం చేస్తున్నట్లు చెప్పారు.


Video: ఆంధ్రప్రదేశ్‌వాసి సేవపై ప్రధాని మోదీ ప్రశంసలు


3. కోనసీమలో ఇంటర్నెట్‌ బంద్‌.. గోదావరి తీరాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు..!

అమలాపురంలో జరిగిన ఘటన నేపథ్యంలో కోనసీమలో ఐదు రోజులైనా ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించలేదు. మరోసారి అటువంటి ఘటనలకు చోటివ్వకుండా కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఐదు రోజులైనా వాటి పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలో ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోయాయి.

4. పాకుతూనే ఉన్న మంకీపాక్స్‌.. మరో రెండు దేశాల్లో గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ.. మంకీపాక్స్‌ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి పాకుతోంది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా మెక్సికో, ఐర్లాండ్‌ దేశాల్లోనూ తొలి కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ గుర్తించినట్లు మెక్సికో వైద్యాధికారులు వెల్లడించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

5. పిక్చర్ పర్‌ఫెక్ట్‌.. ఇద్దరు లెజెండ్స్‌ ఒకే ఫ్రేమ్‌లో..!

సినీపరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌. కెరీర్‌లో రాణిస్తోన్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. గత కొంతకాలంగా సినిమా, రాజకీయాలతో బిజీ కావడంతో వీరిద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశ పడుతున్న అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. ‘విక్రమ్‌’ సినిమా ఈ స్టార్‌ హీరోలను కలిపింది.


Flight Missing: 22 మంది ఉన్న విమానం అదృశ్యం..


6. క్రిప్టోకరెన్సీ వినియోగించే ఆలోచనలో రష్యా..!

అంతర్జాతీయ చెల్లింపులకు క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని అనుమతించే విషయంపై రష్యా పరిశీలిస్తున్నట్లు ఓ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ చెల్లింపు సెటిల్మెంట్లకు డిజిటల్‌ కరెన్సీలు వినియోగం ఆలోచనపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్‌ పాలసీ విభాగం అధిపతి ఇవాన్‌ చెబ్సకోవ్‌ పేర్కొన్నట్లు ఆ కథనంలో వెల్లడించింది. దేశంలోని క్రిప్టో కరెన్సీలను క్రమబద్ధీకరించడం, డిజిటల్‌ కరెన్సీల వినియోగంపై తీవ్ర చర్చజరుగుతోంది.

7. భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న చైనాను 2021-22లో యూఎస్‌ అధిగమించింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాల ప్రకారం.. 2021-22లో భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది.

8. అమెరికాలో ఉన్నప్పుడు ఆర్యన్‌ గంజాయి షురూ?

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అభియోగపత్రంలో ఈ విషయాన్ని పొందుపర్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన 20 మందిలో 14 మందిపై ఎన్‌సీబీ శుక్రవారం ముంబయి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


Video: దక్షిణాసియా క్రీడల్లో తండ్రీకొడుకులకు బంగారు పతకాలు


9. అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా మాగ్నెటిక్‌ బాంబులు..!

అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌  గ్రామం వద్ద పోలీసులు ఆదివారం కూల్చివేశారు. ఆ డ్రోన్‌ నుంచి ఏడు మాగ్నెటిక్‌ బాంబులను, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకొన్నారు. తొలుత డ్రోన్‌ కదలికలను రాజ్‌బాఘ్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సెర్చిపార్టీ గుర్తించింది.

10. రష్యా ఆయుధ రహస్యాలు చూసి.. అమెరికా గుండెబద్దలు..!

రష్యా దాడితో తూర్పు ఉక్రెయిన్‌లో నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల ఉక్రెయిన్‌ దళాలు ఎదురు దాడి చేసి రష్యా సైన్యాన్ని తరిమికొట్టాయి. ఈ క్రమంలో మాస్కో సేనలకు చెందిన పలు ఆయుధాలను, శకలాలను ఉక్రెయిన్‌ దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఆ ఆయుధాల్లో విడిభాగాలను పరిశీలించిన కీవ్‌ సేనలు కంగుతిన్నాయి. రష్యా వాడిన చాలా ఆయుధాల్లో కీలక ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల్లో పశ్చిమ దేశాలకు చెందిన చిప్స్‌ కనిపించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు తయారు చేసే చిప్స్‌ వీటిల్లో విరివిగా ఉన్నాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని