Top 10 News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 Apr 2024 16:59 IST

1. తిహాడ్‌ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి

దిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కవిత తిహాడ్‌ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. పింఛన్లు డోర్‌ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు: చంద్రబాబు

రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జగన్‌ (YS Jagan) తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.  తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని.. బాబాయ్‌ను చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు. వైకాపా నేతలు శవరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం.. రష్యా ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌ (Ukraine) ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవ్స్క్‌ వైమానిక స్థావరంపై నిన్న రాత్రి జరిగిన    ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని బారెన్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  వైఎస్సార్‌ ఉంటే అలాంటివి సహించేవారా?: సునీత

 వైఎస్‌ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. తక్కువ పోలింగ్‌.. 266 లోక్‌సభ స్థానాలపై ఈసీ నజర్‌

సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) పోలింగ్‌ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైన 266 స్థానాలను గుర్తించింది. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు (67.40) కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. దీంతో ఈసారి అక్కడ ఓట్ల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు వేస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్నికల తర్వాతే.. ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం : రాహుల్‌

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు అని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. భూకంపం నుంచి భారీ టవర్‌ను ఈ స్టీల్‌బాల్‌ ఎలా రక్షించింది?

భారీ భూకంపం తైవాన్‌ను (Taiwan earthquake) కుదిపేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,011 మంది గాయపడ్డారు. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా దాదాపు 770 భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూ, ఇటూ ఊగాయి. రోడ్లపై వాహనాలు కుదుపులకు లోనైన పలు వీడియోలు బయటకొచ్చాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటివి మదుపరులపై ప్రభావం చూపాయి. దీంతో సూచీలు స్తబ్దుగా ముగిశాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రెడ్‌ డైరీ అంటే వైకాపాలో వణుకు: నారా లోకేశ్‌

సార్వత్రిక ఎన్నికల వేళ తెదేపాలో భారీగా చేరికలు జరిగాయి. అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి పలువురు నేతలు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీ సహా పలువురు నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. వైకాపా ఏపీని ఖాళీ చేసే పరిస్థితి ఇప్పుడే వచ్చిందన్నారు. రెడ్‌ డైరీ అంటే ప్రతి ఒక్కరిలోనూ వణుకుమొదలైందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు ఇక సులువు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్త యాప్‌

 ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి రాబోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో దీన్ని తీసుకురాబోతోంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని