భూకంపం నుంచి భారీ టవర్‌ను ఈ స్టీల్‌బాల్‌ ఎలా రక్షించింది?

Taiwan Earthquake: తైవాన్‌లో బుధవారం సంభవించిన భూకంపం 9 మంది ప్రాణాలను బలిగొంది. భారీ ఆస్తి నష్టాన్ని కలగజేసింది. కానీ, 101 అంతస్తుల తైపీ టవర్‌కు మాత్రం పెద్దగా ఏమీ కాలేదు. దీనికి కారణమేంటో చూద్దాం..!

Published : 05 Apr 2024 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ భూకంపం తైవాన్‌ను (Taiwan earthquake) కుదిపేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,011 మంది గాయపడ్డారు. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా దాదాపు 770 భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూ, ఇటూ ఊగాయి. రోడ్లపై వాహనాలు కుదుపులకు లోనైన పలు వీడియోలు బయటకొచ్చాయి. భూకంప కేంద్రానికి 80 మైళ్ల దూరంలో ఉన్న తైపీలోనూ భవనాలు ప్రమాదకర స్థాయిలో కుదుపులకు గురయ్యాయి. కానీ, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం అయిన తైపీ-101 (Taipei-101)కి మాత్రం ఏమీ కాలేదు. ఆధునిక ఇంజినీరింగ్‌ సాధించిన అద్భుత విజయంగా అభివర్ణిస్తున్న ఈ భారీ నిర్మాణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థే అందుకు కారణం. దాని విశేషాలేంటో చూద్దాం.

660 టన్నుల గోళం..

భూకంపం సంభవించినప్పుఏడు 1,667 అడుగుల తైపీ-101 (Taipei-101) కొద్దిగా ఊగినట్లు వీడియో ఫుటేజీల్లో కనిపిస్తోంది. కానీ, భారీ కుదుపులకు మాత్రం లోనుకాలేదు. 101 అంతస్తుల ఈ ఆకాశహర్మ్యంలో పై భాగంలో ఏర్పాటుచేసిన గోళం లాంటి వస్తువే అందుకు కారణం. దీన్నే ఇంజినీరింగ్‌ పరిభాషలో ‘ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్‌’గా వ్యవహరిస్తారు. 87 నుంచి 92 అంతస్తుల మధ్య ఈ భారీ గోళాన్ని 92 మందమైన కేబుల్స్‌తో బిగించారు. దీని బరువు 660 టన్నులు. మొత్తం 41 భారీ ఉక్కు షీట్లతో నిర్మించారు. దీని వ్యాసం 18 అడుగులు. ఇది ఏ దిశలోనైనా దాదాపు 5 అడుగుల వరకు కదులుతుంది. ఫలితంగా, భారీ ప్రకంపనల వల్ల వచ్చే కుదుపులను ప్రతిఘటించే లేదా తగ్గించే లోలకంలా (pendulum) పని చేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..

‘‘భవనం ఊగినప్పుడు ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లు వ్యతిరేక దిశలో కదులుతాయి. తైపీ-101లో ఈ గోళం వేలాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా టవర్‌లో కుదుపులు వచ్చినప్పుడు అది వ్యతిరేక దిశలో ఊగుతుంది. తద్వారా గతిశక్తిని గ్రహిస్తుంది. గోళానికి, టవర్‌కు మధ్య ఉన్న హైడ్రాలిక్‌ సిలిండర్లు ఆ శక్తిని ఉష్ణంగా మార్చి చెదరగొడతాయి’’ అని ‘సూపర్‌టాల్‌: హౌ ద వరల్డ్స్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఆర్‌ రీషేపింగ్‌ అవర్‌ సిటీస్‌ అండ్‌ లైవ్స్‌’ పుస్తక రచయిత స్టీఫెన్‌ వివరించారు.

భారీ గాలుల నుంచి కూడా..

ప్రపంచవ్యాప్తంగా ఆకాశహర్మ్యాల్లో ఇలాంటి ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లను వాడుతున్నట్లు స్టీఫెన్‌ తెలిపారు. భూకంపాల సమయంలో వచ్చే ప్రమాదకర కుదుపుల వల్ల కలిగే ‘హార్మోనిక్‌ వైబ్రేషన్స్‌’ కారణంగా భవనాలు కుప్పకూలుతాయని తెలిపారు. భవనాలు వాటి సొంత రెసొనెన్స్‌ (Resonance) వద్ద కంపిస్తే కుదుపులు క్రమంగా పెరగడమే అందుకు కారణమని భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా వివరించారు.     వాటి నుంచి రక్షించేందుకే ఈ డ్యాంపెనర్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ గాలులు వీచే సమయంలో భవనంలో ఉండేవారికి కలిగే అసౌకర్యం నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

నిర్మాణంలోనూ ప్రత్యేకత..

ఈ డ్యాంపెనర్‌తో పాటు భారీ ప్రకంపనలను సైతం తట్టుకునేలా తైపీ-101 నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు స్టీఫెన్‌ తెలిపారు. లోతైన పునాదిపై 380 కాంక్రీటు, ఉక్కు పిల్లర్లతో ఈ టవర్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. అలాగే బిల్డింగ్‌ మూల నిర్మాణాన్ని భారీ బీములు, ఉక్కు పిల్లర్లతో అనుసంధానించినట్లు చెప్పారు. ఇవన్నీ ఈ ఆకాశహర్మ్యానికి పటిష్ఠతను చేకూర్చినట్లు చెప్పారు. డిజిటల్‌ డిజైనింగ్‌ దశలోనే   అన్ని రకాల ప్రమాదాలను తట్టుకునేలా దీన్ని పరీక్షించినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని