Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 14 Aug 2022 21:04 IST

1. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు భారత్‌ దిక్సూచి: కేటీఆర్‌

విభిన్న మతాలు, కులాలు, సంప్రదాయాల కలయికగా ఉన్న భారత్‌లో.. దేశభక్తి విషయంలో అంతా ఐక్యంగా ఉంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్‌.. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు దిక్సూచిగా ఉంటుందని ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఏరియా హెడ్‌ క్వార్టర్స్‌ సైనికులు రెండు రోజులపాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

2. నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారు: గోరంట్ల

ఫేక్‌ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయలుదేరిన ఎంపీ మాధవ్‌కు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్‌ వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ   మాట్లాడుతూ... మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయన్నారు.


Video: ప్రజల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాం: శైలజాకిరణ్


3. తుపాకి పేల్చితే రాజీనామా అంటున్నారు.. ఇదేం కక్కుర్తి రాజకీయం: శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తోసిపుచ్చారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జరిగిన సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఒక ఘటన జరిగితే విచారణ ఉంటుందని, తాను పేల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ అని స్పష్టం చేశారు.

4. ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం

ప్యాకింగ్‌ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎడిబిల్‌ ఆయిల్స్‌ అండ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సంఘం డిమాండ్‌ చేసింది. ఇలాంటి ఆదేశాల అమలు వల్ల రాష్ట్రంలో వంట నూనెల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా లక్షలాది మంది చిరు వ్యాపారులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ వర్తక సంఘాల నేతలు ఆదివారం విజయవాడలో సమావేశమయ్యారు. 

5. అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 40గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి బారులు తీరడంతో క్యూలైన్లు ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు చేరుకున్నాయి. క్యూలైన్‌ భారీగా ఉండటంతో తొక్కిసలాట జరగకుండా తితిదే చర్యలు చేపట్టింది. దర్శనానికి వెళ్లే భక్తులను సమన్వయం చేస్తూ బృందాలుగా పంపుతున్నారు.


Video: ‘భీమ్లా నాయక్‌’లో ఆది.. ‘సైరా’లో నిహారిక.. ఎవరు బెటర్‌?


6. ఈ ఆల్‌రౌండరే.. భారత్‌ - పాక్‌ జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం!

మెగా టోర్నీల్లో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇటు బ్యాటింగ్‌ సహా బౌలింగ్‌లో రాణించి జట్టు విజయం కోసం కష్టపడతారు. మరి అలాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్న టీమ్‌లు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియాకు హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్‌ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే పాండ్య మినహా మిగతావారంతా స్పిన్నర్లు. పాండ్య ఒక్కడే ఫాస్ట్‌బౌలింగ్‌ వేయగలిగే బౌలర్‌.

7. దేశం ఆశలన్నీ వారిపైనే.. జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయ్‌.. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశానికి అతి పెద్ద ఆశాదీపాలు మన పుత్రికలేనన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రలజందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.  భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమన్నారు.

8. ర్యాలీలో వీడియో ప్లేచేసి.. భారత్‌ను ప్రశంసించిన ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు పశ్చిమ దేశాలు నిందించిన సమయంలో భారత్‌ అనుసరించిన విదేశాంగ విధానాన్ని కొనియాడారు. లాహోర్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. గతంలో స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లోవా వేదిక నుంచి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియోను ప్లే చేసి మరీ వినిపించారు.


Video: వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియా.. రాకేశ్ ఝున్ ఝున్ వాలా ప్రస్థానం


9. అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అటారీ-వాఘా సరిహద్దులో (Wagah Border) బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు (Beating Retreat) ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు కవాతు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు వేల సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరవుతుంటారు.

10. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ వీక్షించిన సీఎం మాన్‌.. ఏమన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఈ సినిమాను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆదివారం వీక్షించారు. పరస్పర సోదరభావంతో మెలగాలన్న సందేశాన్నిచ్చేలా  ఈ ఈ చిత్రం ఉందని ఆయన మెచ్చుకున్నారు. యువ హృదయాల్లో విద్వేష బీజాలు నాటనివ్వదని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన భగవంత్‌ మాన్‌.. హీరో ఆమిర్‌ ఖాన్‌, ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు