TTD: అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 40గంటలు

క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు, విజిలెన్స్‌ విభాగాలు అన్నప్రసాదం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.

Updated : 14 Aug 2022 19:44 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి బారులు తీరడంతో క్యూలైన్లు ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు చేరుకున్నాయి. క్యూలైన్‌ భారీగా ఉండటంతో తొక్కిసలాట జరగకుండా తితిదే చర్యలు చేపట్టింది. దర్శనానికి వెళ్లే భక్తులను సమన్వయం చేస్తూ బృందాలుగా పంపుతున్నారు. ఏటీసీ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు విస్తరించి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి దాదాపు 40 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. తితిదే జేఈవో వీరబ్రహ్మం తిరుమలలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు, విజిలెన్స్‌ విభాగాలు అన్నప్రసాదం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ప్రధాన అన్న ప్రసాద సముదాయంలో దాదాపు 50వేల మందికి, వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలోని 1.30లక్షల మందికి అన్న ప్రసాదం, ఉప్మా, పొంగల్‌ పంపిణీ చేసినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6గంటల వరకు దాదాపు 60వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భారీ రద్దీ కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకుండా వేలాది మంది స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా తితిదే విజిలెన్స్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాకుండా జార్ఖండ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి వచ్చిన యాత్రికులు, కొత్తగా పెళ్లయిన జంటలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ క్యూలైన్లను నిరంతరం పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని