Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Apr 2024 20:59 IST

1. గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాయి విసిరిన ఆగంతకుడు

 విశాఖ జిల్లా గాజువాకలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌లో 2 లక్షల ఖాతాలపై ‘ఎక్స్‌’ నిషేధం.. కారణమిదే!

 ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ నియమాలు 2021 (IT Rules 2021) ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఫోన్‌ రిపేరుకు ఇచ్చి.. పోలీసులకు చిక్కి’.. ఎన్‌ఐఏ కస్టడీలో బెంగళూరు బ్లాస్ట్‌ నిందితులు!

 బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (NIA) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, మార్చి 1న చోటుచేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్‌లు, ఫేక్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. పవన్‌ కల్యాణ్‌పై రాయితో దాడికి యత్నం

 ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘వారాహి యాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే.. జగన్‌కూ: పవన్‌ కల్యాణ్‌

అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. రైతుల పాస్‌పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని మండిపడ్డారు.దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే జగన్‌కూ పడుతుందని, తాడేపల్లి ప్యాలెస్‌లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని దుయ్యబట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. లాలూజీ.. వాళ్లను దారిలో పెట్టండి: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav), కుమార్తె మిశా భారతిపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) తీవ్ర విమర్శలు గుప్పించారు. జైలుకు వెళ్లిన వారు, బెయిల్‌పై వచ్చినవారు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)ని కారాగారానికి పంపడం గురించి మాట్లాడుతున్నారంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ మండిపడ్డారు. మిశా భారతిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీరామ నవమి వేళ అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు

అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram temple) నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఉత్సవాల్లో రాములోరి ప్రసాదంగా భక్తులకు పంచేందుకు భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,11,111 కిలోల లడ్డూలను రామాలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపుర్‌లో దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. అదానీ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు.. 59% పెరిగిన విలువ

 ప్రభుత్వరంగ బీమా సంస్థ ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఆఫ్‌ ఇండియా’కు అదానీ గ్రూప్‌లో (Adani Group) ఉన్న పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 59 శాతం పుంజుకుంది. అమెరికన్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ నమోదిత కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఎల్‌ఐసీ రాబడి సైతం అదే స్థాయిలో కుంగింది. ఎట్టకేలకు ఆయా కంపెనీల షేర్లు తిరిగి పుంజుకోవటంతో ఎల్‌ఐసీ పెట్టుబడులకు 2023-24లో మంచి ప్రతిఫలాలు దక్కాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మాల్దీవుల్లో భారత్‌ బలగాలు.. రెండో బృందం వెనక్కి..

మాల్దీవుల (Maldives) నుంచి భారత్‌ సైనికులు (Indian Military) వెనక్కి వచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో విడతగా మన బలగాలు వెనక్కి వచ్చాయి. వీరిలో భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాఫ్టర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఖర్గేతో ఆప్‌ నేత సంజయ్ సింగ్ భేటీ

ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతృత్వంలో మరో ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన ఖర్గేను కోరారు. సంజయ్‌ సింగ్‌  మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నాయకుడైన ఖర్గే మాకు మద్దతుగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఖర్గే మద్దతు కోరాను’ అని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని