Updated : 28 May 2022 17:05 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఎన్నడూ రాజీ పడలేదు.. ప్రజలు తలవంచుకునేలా చేయలేదు..!

మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్‌ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్లు నిజాయతీగా కృషిచేశామని ప్రధాని మోదీ అన్నారు. దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్‌ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత చాటారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న స్వరాష్ట్రం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ నిర్మించిన కేడీపీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు.

2. ఆర్యన్‌ఖాన్‌ను కేసులో ‘ఇరికించేలా’ దర్యాప్తు..!

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్‌ లభించడంతో.. ఈ కేసులో తొలుత దర్యాప్తు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) దర్యాప్తులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌సీబీ దర్యాప్తులో తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఈ కేసును రీ ఇన్వెస్టిగేట్‌ చేసిన సిట్‌(పత్యేక దర్యాప్తు బృందం) గుర్తించింది. ఆర్యన్‌ ఖాన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.


Video: జగన్ ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు


3. పంజాబ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్‌ మాన్‌ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

4. మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌..!

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న వేళ.. మంకీపాక్స్‌ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్‌ పాకగా.. 200లకు పైగా కేసులు వెలుగుచూశాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ గురించి ముమ్మర పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశానికి చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది.

5. ఈ కామర్స్‌ సైట్లలో ఫేక్‌ రివ్యూల అడ్డుకట్టకు ప్రభుత్వం చర్యలు

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో.. ఇలా ఈ-కామర్స్‌ సైట్ల నుంచి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఉత్పత్తిపై గతంలో కొన్నవారి అభిప్రాయాలను చూస్తుంటాం. వాటి ఆధారంగానే కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటాం. కానీ, ఒక్కోసారి కొంతమంది నకిలీ రివ్యూలు కూడా పోస్ట్‌ చేస్తుంటారు. దీనివల్ల ఇటు కొనుగోలుదారులతో పాటు అటు విక్రేతలు, ఈకామర్స్‌ సంస్థలకు కూడా నష్టం. ఈ నేపథ్యంలో నకిలీ రివ్యూలకు అడ్డుకట్ట  వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.


Health News: యోగాసనాలతో నెగిటివ్‌ ఆలోచనలకు కళ్లెం వేయండి


6. అమెరికాలో తుపాకీ మారణహోమం.. ట్రంప్ స్పందన ఇదే..!

ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో పిల్లలపై జరిగిన తుపాకీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దాంతో తుపాకీ వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తుపాకీ వాడకంపై నియంత్రణలను కఠినతరం చేయాలనే డిమాండ్లను ట్రంప్‌ తోసిపుచ్చారు. చెడు నుంచి తమను తాము రక్షించుకునేలా తుపాకీ వాడేందుకు చట్టానికి లోబడి జీవించే అమెరికన్లను అనుమతించాలన్నారు.

7. టెక్సాస్‌ ఘటనలో వేచి చూడటం.. పోలీసులది తప్పుడు నిర్ణయమే!

ఇటీవల అమెరికా టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాకీతో కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతోపాటు మొత్తం 21 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటనలో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. అయితే, అంతకుముందు దాదాపు గంటసేపు నిందితుడు దారుణానికి పాల్పడుతోన్నా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

8. పథకాల రూపంలో ప్రజల డబ్బును ప్రజలకే ఇస్తున్నాం: స్పీకర్‌ తమ్మినేని

ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బును వివిధ సంక్షేమ పథకాల ద్వారా తిరిగి ప్రజలకే అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పలు అభివృద్ధి పనులకు తమ్మినేని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.


Video: మనిషికే విలువ.. కులానికి కాదు : బాలకృష్ణ


9. లోకేశ్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే కుమార్తె

వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని కలిశారు. ఒంగోలులో లోకేశ్‌ను కలిసిన ఆమె.. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని లోకేశ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బద్వేల్‌ తెలుగుదేశం మహిళా నేత విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు కావడంతో పుట్టింటితో పాటు మెట్టినింట రాజకీయ పలుకుబడి కూడా ఆమెకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

10. బట్లర్‌ బ్యాటింగ్‌ గురించి వర్ణించడం కష్టం: సంగక్కర

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (824) పరుగులతో ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే నాలుగు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం గుజరాత్‌తో తలపడే ఫైనల్‌ మ్యాచ్‌లోనూ మరో వంద పరుగులు సాధిస్తే ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. అయితే, గతరాత్రి బెంగళూరుతో ఆడిన క్వాలిఫయర్‌-2లో అతడు నాలుగో సెంచరీ బాదడంపై రాజస్థాన్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర హర్షం వ్యక్తం చేశాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని