Punjab: పంజాబ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు

Published : 29 May 2022 01:48 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్‌ మాన్‌ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది.

రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం మాన్‌ అన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్‌ వెల్లడించారు.

అంతకుముందు, మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ.75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరవాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల కోట్లాది రూపాయలు ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. అయితే దీనిపై రాష్ట్ర శాసనసభలో బిల్లు తీసుకురావాలని పంజాబ్‌ గవర్నర్‌.. ప్రభుత్వానికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని