Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌ను కేసులో ‘ఇరికించేలా’ దర్యాప్తు..!

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్‌ లభించడంతో.. ఈ కేసులో తొలుత దర్యాప్తు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌

Published : 28 May 2022 16:15 IST

అనేక అవకతవకలు జరిగాయన్న సిట్‌

దిల్లీ: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్‌ లభించడంతో.. ఈ కేసులో తొలుత దర్యాప్తు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) దర్యాప్తులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌సీబీ దర్యాప్తులో తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఈ కేసును రీ ఇన్వెస్టిగేట్‌ చేసిన సిట్‌(పత్యేక దర్యాప్తు బృందం) గుర్తించింది. ఆర్యన్‌ ఖాన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

గత ఏడాది అక్టోబరు 2న కార్డీలియా కంపెనీకి చెందిన క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ దొరకడంతో అప్పటి ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో అధికారులు మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్‌ ఖాన్‌ ఒకరు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన వాంఖడేపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను కేసును తప్పించారు. ఆ తర్వాత సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) కేసును అప్పగించారు.

వైద్య పరీక్షలు, వీడియోగ్రఫీ లేకుండానే..

అనంతరం సిట్‌ దర్యాప్తు చేపట్టగా.. ఎన్‌సీబీ బృందం అనేక అవకతవకలకు పాల్పడినట్లు బయటపడింది. కేవలం ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్‌ గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆర్యన్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడు డ్రగ్స్‌ తీసుకున్నాడా లేదా అని రుజువు చేసేందుకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదని సిట్‌ హెడ్‌ తెలిపారు. క్రూజ్‌ నౌకలో సోదాలు చేపట్టినప్పుడు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు.

ఆర్యన్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్‌ చేసే విషయంలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని సిట్‌ హెడ్‌ వెల్లడించారు. ఈ కేసులో తొలి నుంచీ ఆర్యన్‌ ఫోన్‌ స్వాధీనంపై అనేక ప్రశ్నలు తలెత్తినట్లు తెలిపారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు లేదా కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్‌ వెల్లడించింది. అంతేగాక, డ్రగ్స్‌ సరఫరాలో అంతర్జాతీయ ముఠాతో అతడికి సంబంధాలున్నట్లు ఎన్‌సీబీ చేసిన ఆరోపణలకు కూడా సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. అందుకే అతడికి ఈ కేసులో క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు పేర్కొంది.

 ఇక ఈ కేసులో సాక్షిగా మారిన ప్రభాకర్‌ సెయిల్‌ను ప్రశ్నించగా.. అధికారులు తనతో తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నట్లు చెప్పాడని సిట్‌ వెల్లడించింది. అంతేగాక నౌకలో ఎలాంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తాను చూడలేదని సెయిల్‌ చెప్పాడట. ఆర్యన్‌ కుటుంబం నుంచి ఎన్‌సీబీ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేసినట్లు సెయిల్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే అతడు అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. అయితే సెయిల్‌ గుండెపోటుతో చనిపోయినట్లు ఎన్‌సీబీ ఆ మధ్య వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు