Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 Mar 2024 20:58 IST

1. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 4% డీఏ పెంపు

సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వచ్చేసింది. వారి కరవు భత్యం (DA) 4% పెరిగింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 46శాతం డీఏ 50శాతానికి చేరుకున్నట్లయ్యింది. జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎల్పీజీ రాయితీ పొడిగింపు..

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్‌ ఉజ్వల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారికి వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ (LPG subsidy) గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ.300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ ఈ రాయితీని వర్తింపజేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.67 వేలు దాటిన బంగారం ధర

దేశంలో బంగారం ధర (Gold price) మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.67 వేల మార్కును దాటింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి బులియన్‌ విపణిలో రూ.67,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 76 వేల ‘ధరణి’ దరఖాస్తుల పరిష్కారం

‘ధరణి’ సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2,46,536 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 1 నుంచి తహసీల్దార్ స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో 76,382 దరఖాస్తులు పరిష్కరించినట్లు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారంలో హెలికాప్టర్లు, వాహనాల వినియోగం, సభలు, సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతుల వ్యవహారంపై పార్టీ నేతలకు సూచనలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యూరప్‌లో ‘ప్యారెట్‌ ఫీవర్‌’ కలవరం.. ఐదుగురు మృతి!

ఐరోపా దేశాలను ప్రాణాంతక ప్యారెట్‌ ఫీవర్‌ (Parrot Fever) వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్‌ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాంగ్రెస్‌ సీఈసీ కీలక భేటీ.. లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) తొలిసారి సమావేశమైంది. దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. తొలుత దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్‌, కేరళ, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపుర్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 60 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధర్మశాలలో దంచేశారు.. తొలి రోజు టీమ్‌ఇండియాదే

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియా (Team India) పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి శీతల ప్రాంతమైన ధర్మశాలలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్ట్టించింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌటైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనా కారణంగానే సరిహద్దులో రక్తపాతం : జైశంకర్‌

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌.. అంతర్జాతీయ వేదికపై చైనా (China) తీరును మరోసారి తూర్పారపట్టారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో (నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి) చోటుచేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేసీఆర్‌, రేవంత్‌ను ఒకేసారి ఓడించినా.. ఆ కోరిక తీరలేదు: ఎమ్మెల్యే రమణారెడ్డి

తన పార్టీ గెలిచి మంత్రి పదవి చేపట్టాల్సి వస్తే సినిమాటోగ్రఫీ శాఖను తీసుకోవాలని కోరిక ఉందంటూ భాజపా నాయకుడు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Ramana Reddy) అన్నారు. సాయిరాం శంకర్ నటించిన ‘వేయ్ దరువేయ్’ (Vey Dharuvey) మూవీ ముందస్తు విడుదల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని