LPG subsidy: ఎల్పీజీ రాయితీ పొడిగింపు.. మరో ఏడాది పాటు రూ.300 తగ్గింపు

Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల లబ్ధిదారులకు ఇస్తున్న సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును మరో ఏడాది పొడిగించింది.

Updated : 07 Mar 2024 20:16 IST

LPG subsidy | దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్‌ ఉజ్వల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారికి వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ (LPG subsidy) గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ.300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ ఈ రాయితీని వర్తింపజేసింది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్న వేళ మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై రూ.12వేల కోట్ల భారం పడనుందని చెప్పారు.

2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తారు. సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంఉటంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. ప్రస్తుతం దిల్లీలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.903గా ఉంది. ఆ లెక్కన వీరికి రూ.603కే లభిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో గతేడాది ఆగస్టులో రూ.200 చొప్పున గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించడంతో అటు ఉజ్వల లబ్ధిదారులతో పాటు ఇతర గ్యాస్‌ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు సగటున ఏడాదికి  3.68 రీఫిల్స్‌ వినియోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని