MLA Ramana Reddy: కేసీఆర్‌, రేవంత్‌ను ఒకేసారి ఓడించినా.. ఆ కోరిక తీరలేదు: ఎమ్మెల్యే రమణారెడ్డి

MLA Ramana Reddy: సాయిరాం శంకర్‌ నటించిన ‘వెయ్‌ దరువెయ్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రమణారెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 07 Mar 2024 21:05 IST

హైదరాబాద్‌: తన పార్టీ గెలిచి మంత్రి పదవి చేపట్టాల్సి వస్తే సినిమాటోగ్రఫీ శాఖను తీసుకోవాలని కోరిక ఉందంటూ భాజపా నాయకుడు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Ramana Reddy) అన్నారు. సాయిరాం శంకర్ నటించిన ‘వేయ్ దరువేయ్’ (Vey Dharuvey) మూవీ ముందస్తు విడుదల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. పదేళ్ల కిందట తన నియోజకవర్గంలో ఎవరూ గుర్తుపట్టకపోయినా, ఇప్పుడు విదేశాల్లో సైతం తనతో కలిసి ఫొటోలు దిగుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు కారణం కేసీఆర్, రేవంత్ రెడ్డిలేనన్నారు.

‘‘మొదటి నుంచి సినిమాలంటే నాకు బాగా ఇష్టం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది సినిమా. మిగిలినవన్నీ వ్యసనాలే. ఇది మాత్రం వ్యసనం కాదు. వేరే అలవాట్లు ఆస్తులను కరిగిస్తాయి. కానీ, రూ.150 పెట్టి టికెట్‌ కొంటే, వందల కోట్ల సంతోషం అనుభవించవచ్చు. హరీశ్‌, మాలాశ్రీ నటించిన ‘ప్రేమఖైదీ’ మూవీ ఆడిషన్స్‌లో నేనూ పాల్గొన్నా. ఫైనల్‌ ఆడిషన్స్‌ సమయంలో వేరే పని ఉండి రాలేకపోయా. ఆ తర్వాత వ్యాపారాలతో బిజీ అయిపోయా. ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఉండాలంటే అది రాజకీయాల్లో ఉండటం ఒకటేనని భావించా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. చనిపోయినా తర్వాత కూడా మనల్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. మనం ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. పేరు, మనం చేసిన మంచి పనులే మనల్ని ప్రజల గుండెల్లో ఉంచుతాయి’’ అని అన్నారు.

ఎమ్మెల్యే రమణారెడ్డి మాటలపై స్పందించిన దర్శకుడు హరీశ్ శంకర్ రమణారెడ్డి విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. సినీ పరిశ్రమ గురించి గొప్పగా మాట్లాడిన తొలి రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. నిరంతరం సినిమాలను చూసే నాయకుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు  ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని