ట్రంప్‌తో విభేదించిన ఫౌచీ

కరోనా వైరస్‌ త్వరలోనే అదుపులోకి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ విభేదించారు.

Published : 12 Sep 2020 11:51 IST

కరోనాను త్వరలోనే అదుపులోకి తెస్తామన్న వ్యాఖ్యలపై..

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ త్వరలోనే అదుపులోకి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ విభేదించారు. దేశంలో వైరస్‌ తీవ్రత ప్రమాదకరంగా ఉందని, కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలకు సంబంధించిన గణాంకాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికీ అక్కడ నిత్యం సుమారు 40 వేల కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయని దేశంలో కరోనా తీవ్రతను వెల్లడి చేశారు. 

మొదట్లో కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువ చేసి చూసినట్లు అంగీకరించిన ట్రంప్, త్వరలో దాన్ని అదుపులోకి తీసుకువస్తామని నమ్ముతున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ వ్యాఖ్యలపై ఫౌచీ స్పందిస్తూ..‘నేను ట్రంప్ చెప్పిన దాంతో విభేదిస్తున్నాను. గణాంకాలు కలవరపెడుతున్నాయి’ అని మీడియాతో అన్నారు. శీతకాలం కంటే ముందే వైరస్‌ను అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యమన్నారు. ఆ సమయంలో ప్రజలందరు ఇళ్ల లోపల ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. 

అలాగే నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం ట్రంప్ బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించడంపై మాట్లాడుతూ..అది చాలా ప్రమాదంతో కూడుకున్నదన్నారు. ‘మీరు ఆరుబయట ఉంటే సురక్షితంగా ఉన్నారని కాదు. ముఖ్యంగా జన సమూహంతో ఉండి, మాస్కులు ధరించడం లేదు’ అని ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు మొదటి నుంచి మాస్క్‌ ధరించడానికి విముఖత చూపుతున్న సంగతి తెలిసిందే. అలాగే ట్రంప్ ప్రకటనలకు విరుద్ధంగా మాట్లాడుతున్న తనపై ఒత్తిడి పెరుగుతుందన్న వాదనను ఆయన ఖండించారు. తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని