Supriya Sule: ‘హనీమూన్‌’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?

భాజపాతో చేతులు కలిపి మూడు నెలలు (Honeymoon period) గడవక ముందే అజిత్‌ పవార్‌లో అసంతృప్తి నెలకొనడం శోచనీయమని సుప్రియా సూలే పేర్కొన్నారు.

Published : 04 Oct 2023 17:21 IST

ముంబయి: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో (Sharad Pawar) విభేదించి.. భాజపాతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఇటీవల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన మద్దతుదారులకు బెర్తులను కేటాయించడంలో భాజపా నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారట. దీంతో తాజాగా జరిగిన కేబినెట్‌కి హాజరు కాకపోవడంతోపాటు సీఎంతో కలిసి వెళ్లాల్సిన దిల్లీ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశమయ్యింది. ఈ పరిణామాలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అజిత్‌ పవార్‌ ‘రాజకీయ అస్వస్థత’తో ఉన్నారని కాంగ్రెస్‌ విమర్శించగా.. ‘హనీమూన్‌’ సమయం (Honeymoon period) ముగియక ముందే తీవ్ర నిరాశలో మునిగిపోవడం శోచనీయమంటూ సుప్రియా సూలే వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘అజిత్‌ పవార్‌ రాజకీయ అస్వస్థతతో (Political illness) బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకంలో జాప్యం వల్ల అజిత్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది’ అని విపక్ష నేత విజయ్‌ వాడెట్టివార్‌ పేర్కొన్నారు. ఇక ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే స్పందిస్తూ.. ‘ట్రిపుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలలకే.. అందులో ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే వారి బాధను ఫడణవీస్‌ ముందు విన్నవించుకున్నారట. హనీమూన్‌ పీరియడ్‌ ముగియక ముందే అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు..?’ అంటూ సుప్రియా సూలే ప్రశ్నించారు.

ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల మధ్య కొంతకాలంగా సఖ్యత లేదనే వాదన వినిపిస్తోంది. తన మద్దతుదారులకు కీలక జిల్లాల ఇంఛార్జి బాధ్యతలు అప్పజెప్పడంపై రాష్ట్ర భాజపా నిర్లక్ష్యం చేస్తుందని అజిత్‌ పవార్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి అజిత్‌ పవార్‌ దూరంగా ఉన్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి దిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ వెళ్లలేదు. అయితే, ఈ పరిణామాలపై దిల్లీ వెళ్లేముందు స్పందించిన ఏక్‌నాథ్‌ శిందే.. అనారోగ్యం వల్లే కేబినెట్‌ భేటీకి అజిత్‌ పవార్‌ హాజరుకాలేదన్నారు. మరో అభిప్రాయానికి రానవసరం లేదన్నారు. అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఛగన్‌ భుజ్బల్‌ కూడా గొంతు ఇన్‌ఫెక్షన్‌ కారణంగానే అజిత్‌ దిల్లీకి వెళ్లలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని