Anand Mahindra: వాషింగ్టన్ మూమెంట్‌ అంటే ఇదే.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు ప్రముఖులు!

ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఓ ఆసక్తికర ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఒకే ఫ్రేమ్‌లో నలుగురు గొప్ప వ్యక్తులు, ఇది చాలా పవర్‌ఫుల్‌ సెల్ఫీ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.  

Updated : 25 Jun 2023 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎన్నో ఆసక్తికర విషయాలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. ప్రధాని మోదీ (PM Narendra Modi) అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden) శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన స్టేట్‌ డిన్నర్‌కు పలువురు భారత పారిశ్రామివేత్తలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  హాజరైన మహీంద్రా అక్కడి విశేషాలను కూడా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. తాజాగా ఆయన మరో ఆసక్తికర ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో ఆనంద్‌ మహీంద్రా, రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani), థర్డ్‌ఐటెక్‌ సహ-వ్యవస్థాపకురాలు వ్రిందా కపూర్‌ (Vrinda Kapoor)లతో పాటు భారత సంతతి అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఉన్నారు. 

ఆనంద్‌ మహీంద్రా ఈ ఫొటోను ‘వాషింగ్టన్‌ మూమెంట్’ పేరుతో ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘ టెక్నాలజీ సంస్థల సమావేశం ముగిసిన తర్వాత ముకేశ్‌ అంబానీ, వ్రిందా కపూర్, నేను అమెరికా వాణిజ్య కార్యదర్శితో మాట్లాడుతూ.. లంచ్ మీటింగ్‌కు మా కోసం ఏర్పాటు చేసిన బస్‌ను మిస్‌ అయ్యాం. దీంతో ఉబర్‌ క్యాబ్‌లో వెళ్దామని.. కారు కోసం వేచి చూస్తున్న సమయంలో సునీతా విలియమ్స్‌ కనిపించారు. ఆమెతో సెల్ఫీ తీసుకుని.. ఉబర్‌కు బదులుగా స్పేస్‌ షటిల్‌లో మమ్మల్ని తీసుకెళ్లగలరా? అని అడిగాం. ఇలాంటి క్షణాన్నే వాషింగ్టన్‌ మూమెంట్‌ అని పిలుస్తారేమో’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను ఇప్పటి వరకు లక్షమందికి పైగా వీక్షించారు. ‘ఇది చాలా పవర్‌ఫుల్ సెల్ఫీ’, ‘భారత్‌కు చెందిన గొప్ప వ్యక్తులకు సేవలు అందించే అదృష్టం ఉబర్‌కు కలిగింది’, ‘గొప్ప వ్యక్తులు ఒకే ఫ్రేమ్‌లో’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని