Goldy Brar: గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

Updated : 01 Jan 2024 19:13 IST

దిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు పలు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా (Canada)లో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ (Goldy Brar)ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. 

గోల్డీ బ్రార్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇతను అతివాద భావజాలాన్ని వ్యాపింప చేయడంతోపాటు, పలువురు జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు ఆరోపించింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్‌ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది.

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్ల ఆందోళన

ఎవరీ గోల్డీ బ్రార్‌?

సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాల హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాల హత్య కేసులో అరెస్టయిన లారెన్స్‌ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని