Fake News: నకిలీ వార్తల వ్యాప్తి.. రెండేళ్లలో 150 వెబ్‌సైట్లపై వేటు

భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. మే 2021 నుంచి ఇప్పటి వరకు 150కిపైగా వెబ్‌సైట్‌లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది.

Published : 12 Jun 2023 18:01 IST

దిల్లీ : సామాజిక మాధ్యమాలు ( Social Media), యూట్యూబ్‌ (YouTube) ఛానెళ్లు, వెబ్‌సైట్‌ల ద్వారా అసత్య వార్తల ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మే 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 150 వెబ్‌సైట్‌లు, కొన్ని యూట్యూబ్‌ న్యూస్‌ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ యూట్యూబ్‌ ఛానెళ్లు భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. దేశ సమగ్రత, జాతీయ భద్రతకు సంబంధించి ప్రజలను తప్పుదోవపట్టించే ప్రసార మాధ్యమాలను ఉపేక్షించేది లేదని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో విశ్వసనీయమైన, ప్రామాణిక వార్తల ప్రసారాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. 

ప్రస్తుతం నిషేధం విధించిన యూట్యూబ్‌ న్యూస్‌ఛానెళ్లకు సుమారు 1,21,23, 500 సబ్‌స్క్రైబర్లు ఉండగా, వీక్షకుల సంఖ్య 132 కోట్లు ఉన్నట్లు సమాచారం. నిషేధం విధించిన వాటిలో కబర్‌ విత్ ఫాక్ట్స్‌, కబర్‌ తాజ్‌, ఇన్ఫర్మేష్ హబ్‌, ఫ్లాష్‌ న్యూస్‌, మేరా పాకిస్థాన్‌, హకీకత్‌కీ దునియా, అప్నీ దునియా టీవీ వంటివి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లు వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా భారత్‌కు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసత్య వార్తలను ప్రచారం చేసేందుకు న్యూస్‌ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటి వాటిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. 

గతేడాది జులైలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) మాట్లాడుతూ.. 78 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లు, 560 యూట్యూబ్‌ లింక్‌లపై నిషేధం విధించినట్లు తెలిపారు. వీటిలో కొన్ని పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే చానెళ్లు కూడా ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ప్రసారాలు చేసే యూట్యూబ్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్లను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని