SCO: సరిహద్దు వివాదం వేళ.. భేటీకి సిద్ధమైన భారత్‌, చైనా రక్షణశాఖ మంత్రులు!

భారత్‌, చైనా రక్షణ శాఖ మంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఎస్‌సీవో సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు రానున్న చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూ.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో చర్చలు జరపనున్నారు.

Published : 25 Apr 2023 22:14 IST

దిల్లీ: చైనా (China)తో సరిహద్దు వివాదాలు నెలకొన్న వేళ కీలక పరిణామం. భారత్‌, చైనా రక్షణ శాఖ మంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు రానున్న చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూ (Li Shangfu).. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)తో గురువారం సమావేశం కానున్నారు. ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రాంతీయ శాంతిభద్రతలు, ఉగ్రవాద నిరోధక చర్యలు... తదితర అంశాలపై రక్షణ మంత్రులు చర్చిస్తారు’ అని ఒక ప్రకటనలో తెలిపాయి. 2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం, ఇరు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌ 27, 28వ తేదీల్లో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, అఫ్గానిస్థాన్‌లో భద్రత పరిస్థితులు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న అంశాలను పరిష్కరించుకునేందుకు భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు ఇటీవలే 18వ విడత చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సరిహద్దు వివాదాలను పరస్పర ఆమోదయోగ్య రీతిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ పరిణామాల నడుమ ఇరు దేశాల రక్షణశాఖ మంత్రుల చర్చలు జరిపేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు